వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన హత్యా రాజకీయాలు రాజకీయ విజ్ఞులకు విదితమే. ఎందరో టిడిపి కార్యకర్తలను పొట్టన పెట్టుకున్నారని అప్పట్లో చంద్రబాబు నెట్టి, నోరు కొట్టుకున్న సందర్భాలు కోకొల్లలు. అయితే ఇలాంటి కీలక సందర్భాలలో ముఖ్యమంత్రిగా ఉన్న వైయస్ రాజశేఖర్ రెడ్డి, విరివిగా పలికిన మాట “చట్టం తన పని తానూ చేసుకుపోతుంది.” ఈ మాటను చాలా సినిమాల్లో కామెడీ సన్నివేశాలకు కూడా వినియోగించిన విషయం తెలిసిందే.
అలా వైయస్ పలికిన మాటలు టిడిపి పార్టీ వర్గీయులను కాస్తంత ఎక్కువగానే బాధపెట్టాయి. అయితే ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వంలో హత్యా రాజకీయాలకు తావు లేకపోయినా, కనీసం చెప్పిన మాటలనైనా తిరిగి చెప్పాలనుకుంటున్నారో ఏమో గానీ, ఆనాడు వివిధ సందర్భాలలో వైయస్ వేసిన డైలాగ్ ను తాజాగా టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ వాడేసారు.
వైకాపా నేతలు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, మిధున్ రెడ్డిల అరెస్టు వెనుక తెలుగుదేశం పార్టీ ప్రమేయం లేదని, చెవిరెడ్డిపై గతంలోనే కేసు నమోదైందని, ఆ కేసు ఫలితంగానే ఆయన అరెస్టయ్యారని తెలిపిన లోకేష్, ఈ ఉదంతంలో ప్రభుత్వానికి గానీ, పార్టీకి గానీ ఎటువంటి సంబంధమూ లేదని స్పష్టం చేసారు. మిధున్ రెడ్డి విషయంలో “చట్టం తన పని తాను చేసుకుపోతుందని” వ్యాఖ్యానించి వైసీపీ వర్గీయులకు ఒకసారి వైయస్ రాజశేఖర్ రెడ్డిని గుర్తు చేసారు.
రేణిగుంట ఎయిర్ పోర్టులో మిధున్, అక్కడి మేనేజరుపై దాడి చేసిన దృశ్యాలు బయటపెడితే తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించిన జగన్, మాటకు కట్టుబడి వుంటారా? అని లోకేష్ సవాల్ విసిరారు. తమ ప్రభుత్వం ఏ విధమైన కక్ష సాధింపు చర్యలకూ దిగదని లోకేష్ చేసిన వ్యాఖ్యలు, సూటిగా అప్పట్లో వైయస్ ప్రభుత్వ తీరుకు అద్దం పట్టినట్లుగా ఉన్నాయని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. “రాజు గారి పెద్ద కోడలు మంచిది కాదు అంటే, రెండవ కోడలు గురించి చెప్పాలా..!” లోకేష్ సంధించిన డైలాగ్స్ కూడా అలాగే ఉన్నాయి మరి!





