రాజకీయాలతో క్షణం తీరికలేని రాజకీయ నాయకులు కూడా సినిమాల విషయంలో అప్‌డేట్‌గా ఉంటూ సినిమాలలో డైలాగులు వాడేసుకుంటున్నారు. పాపం… ‘గుంటూరు కారం’ దర్శక నిర్మాతలకు, హీరో మహేష్ బాబుకి ఆ సినిమా చాలా నిరాశ కలిగించినప్పటికీ, మన రాజకీయ నాయకులకు మాత్రం అది చాలా ఉపయోగపడుతోంది.
అందరూ ‘కుర్చీ మడత పెట్టి…’వాడేసుకుంటున్నారు. వాలంటీర్ల సభలో జగన్ ‘చొక్కా చేతులు మడత పెట్టి యుద్ధానికి సిద్దం…’ అంటూ డైలాగ్ కొడితే, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, టిడిపి యువనేత నారా లోకేష్ ‘మేము మీ కుర్చీని మడత పెట్టేస్తాం,” అంటూ జవాబిచ్చారు. ఏపీ రాజకీయ నాయకులు ఇలా చొక్కాలు, కుర్చీలు మడత పెడుతుంటే జనాలకు చాలా వినోదంగా ఉండటంతో అందరూ హాయిగా నవ్వుకుంటున్నారు.
టిడిపి యువనేత నారా లోకేష్ విజయనగరం జిల్లా నెల్లిమర్ల శంఖారావం సభలో ప్రసంగిస్తూ, “నువ్వు చొక్కా మడత పెడితే మేము ఇలా కుర్చీ మడత పెట్టి నిన్ను ఇంటికి పంపించేస్తాము,” అంటూ వేదికపై సిద్దంగా ఉంచిన ఓ కుర్చీని మడత పెట్టి చూపారు. అది చూసి అందరూ హాయిగా నవ్వుకున్నారు.
ఎప్పుడూ గంభీరంగా సాగే రాజకీయ సభలలో ఇటువంటి వినోదం కాస్త అవసరమే. అప్పుడే జనాలను సభలో కూర్చోపెట్టగలుగుతారు.
ఈ విషయం జగన్మోహన్ రెడ్డి కూడా గ్రహించారు. అందుకే ఆయన అర్జునుడు, శ్రీకృష్ణుడు, పద్మవ్యూహం అంటూ పురాణాలు మాట్లాడుతుంటారు. జనాలు ముఖ్యమంత్రి నోట ఏపీ రాజధాని, పోలవరం, పరిశ్రమలు, ఉద్యోగాల కల్పన, అభివృద్ధి పనులు గురించి వినాలని ఎదురు చూస్తుంటే, ఆయన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌ల గురించే ఎక్కువగా మాట్లాడుతుంటారు. ఆయన ఏమి చెప్పబోతున్నారో జనాలకు బాగా తెలుసు కనుక వినకుండా మద్యలో లేచి వెళ్ళిపోతుంటారు.
కానీ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ అన్ని అంశాలు, ప్రజా సమస్యల గురించి మాట్లాడుతుంటారు. కనుక ప్రజలు వారితో కనెక్ట్ అవుతుంటారు. మద్యలో కుర్చీ మడత పెడుతూ జనాలను బాగా ఆకట్టుకోగలుగుతున్నారు. అయితే ఈ చొక్కాలు, కుర్చీల కంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని, అభివృద్ధిపై ప్రధానంగా మాట్లాడితే ప్రజలతో ఇంకా బాగా కనెక్ట్ కాగలుగుతారు. అప్పుడే ప్రజలు కూడా మరింత లోతుగా ఆలోచిస్తారు. అప్పుడే టిడిపి, జనసేనలకు ఎన్నికలలో ఆశించిన ఫలితం కూడా వస్తుంది.






