టిడిపి యువనేత నారా లోకేష్ నేడు కర్నూలు పట్టణంలో యువగళం పాదయాత్ర చేస్తున్నారు. ఈ సందర్భంగా స్థానిక ముస్లిం యువతతో ముఖాముఖీ సమావేశమైనప్పుడు నారా లోకేష్ వారిని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “గత ఎన్నికలలో వైసీపీకి 14 శాసనసభ, 2 ఎంపీ సీట్లు ఇచ్చి గెలిపించారు. కానీ ఈ నాలుగేళ్ళలో వైసీపీ ప్రభుత్వం ఉమ్మడి కర్నూలు జిల్లాకి కొత్తగా ఒక్క పరిశ్రమని కూడా తీసుకురాలేకపోయింది. చంద్రబాబు నాయుడు ఓర్వకల్లులో విమానాశ్రయం నిర్మిస్తే, ఈ జగన్మోహన్ రెడ్డి దాని శిలాఫలకం మార్చి తన పేరుతో శిలాఫలకం వేయించుకొని రెండోసారి ప్రారంభోత్సవం చేశారు.
అదే… మీరు గత ఎన్నికలలో టిడిపిని మరోసారి గెలిపించి ఉండి ఉంటే ఓర్వకల్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ పరిశ్రమలతో కళకళలాడుతుండేది. కానీ వైసీపీ దానినీ ఎలా పాడుబెట్టిందో మీరందరూ చూస్తూనే ఉన్నారు. మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తే వైసీపీ నేతలు అక్కడా ఇసుక, మట్టి అంతా తవ్వేసుకొని చివరికి ఆ భూమిని కూడా కబ్జా చేసేయడం ఖాయం.
రాజకీయాలకు అతీతంగా రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చేయాలనేదే టిడిపి విధానం. మాకు కేవలం ముగ్గురు ఎమ్మెల్యేలని ఇస్తేనే మా ప్రభుత్వం కర్నూలులో ఎంతో అభివృద్ధి చేసి చూపింది. ఈసారి ఉమ్మడి కర్నూలు జిల్లాలో 14/2 సీట్లు మా పార్టీకి ఇవ్వండి. కర్నూలు పట్టణాన్ని నేను అభివృద్ధి చేసి చూపిస్తాను. ఒకవేళ చేయలేకపోతే నేను కర్నూలు వచ్చినప్పుడు ఇక్కడే నా కాలర్ పట్టుకొని మీరు నన్ను నిలదీసి అడగండి. నేను కర్నూలు అభివృద్ధి చేస్తానని మాట ఇస్తున్నాను. మరి మీరు ఈసారి టిడిపికి 14/2 సీట్లు ఇచ్చి గెలిపిస్తామని హామీ ఇస్తారా?” అంటూ నారా లోకేష్ వారికి సవాల్ విసిరారు.
ప్రస్తుతం అధికారంలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలలో ఏ ఒక్కరూ కూడా ఇంత ధైర్యంగా జిల్లాలని, నియోజకవర్గాలని అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పలేకపోతున్నారు. ఉత్తరాంద్ర జిల్లాలు అభివృద్ధి చెందాలంటే విశాఖ రాజధాని కావాలని లేకుంటే ఎన్నటికీ అభివృద్ధి కావని సీనియర్ మంత్రి ధర్మాన ప్రసాదరావు చెపుతుండటం అందరూ విన్నారు. పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేమని మరో సీనియర్ మంత్రి అంబటి రాంబాబు కుండబద్దలు కొట్టిన్నట్లు చెపుతారు.
ఈ ఎన్నికల సంవత్సరంలో విశాఖలో పెట్టుబడిదారుల సదస్సు పేరుతో హడావుడి చేసి, దాంతో రూ.13.56 లక్షల కోట్ల పెట్టుబడులు, 6 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేస్తాయని నమ్మబలికారు. నాలుగేళ్ళు మూడు రాజధానుల పాట పాడుతూ కాలక్షేపం చేసేది ఎన్నికలు దగ్గర పడుతుంటే ఇప్పుడు భోగాపురం విమానాశ్రయానికి, భావనపాడు పోర్టుకి మళ్ళీ రెండోసారి శంకుస్థాపన చేశారు. ఇవన్నీ భవిష్యత్‌లో చేస్తామని చెప్పుకొంటున్న పనులే తప్ప వైసీపీ అధికారంలో ఉండగా జరిగేవి కావు… వచ్చేవి కావని అందరికీ తెలుసు.
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో కాలువల నిర్మాణం వంటి చిన్న చిన్న పనులు కూడా జరగడం లేదంటూ మురికి కాలువలో దిగి మరీ నిరసన తెలపడం, పార్టీ నుంచి బయటకు వచ్చేశాక కూడా తన నియోజకవర్గంలో సిఎం జగన్మోహన్ రెడ్డి స్వయంగా మంజూరు చేసిన వంతెన నిర్మాణం, మైనార్టీలకు కళ్యాణ మందపాల నిర్మాణాల కోసం ధర్నాలు చేస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. కానీ నారా లోకేష్ దారి పొడవునా తమ ప్రభుత్వం హయాంలో ఏర్పాటు చేసిన పరిశ్రమలను, విద్యాసంస్థలను సెల్ఫీ ఛాలెంజ్ ద్వారా చూపిస్తూనే ఉన్నారు. మళ్ళీ అధికారం ఇస్తే ఇంకా అభివృద్ధి చేసి చూపిస్తామని సవాల్ చేస్తున్నారు. వైసీపీలో ఏ మంత్రి, ఎమ్మెల్యేఅయినా ఇలా సవాల్ చేయగలరా? సెల్ఫీ ఛాలెంజ్‌ను స్వీకరించి తాము చేసిన అభివృద్ధి పనులను చూపగలరా?



