లోకేష్‌ని తరిమేసి చంద్రబాబుని ఏకాకిని చేయాలనుకుంటే…

Nara Lokesh political rise challenging Jagan in Andhra Pradesh politics

ఏ రంగంలోనైనా స్పూర్తినిచ్చేవారుంటారు… వారి స్పూర్తితో ఆయా రంగాలలో, జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగిన వారు కూడా ఉంటారు. రాజకీయాలలో కూడా ఈ రెండు రకాల నాయకులు చాలా మంది ఉన్నారు.

కానీ అన్ని రంగాలలో మాదిరిగానే రాజకీయాలలో కూడా అసూయా ద్వేషాల కారణంగా అలాంటి స్పూర్తినివ్వగల స్థాయిలో ఉన్నవారు సైతం తాము నష్టపోయి, తమని నమ్ముకున్నవారిని నష్టపరిచి, రాష్ట్రానికి, దేశానికి కూడా నష్టం కలిగించినవారు మన చుట్టూనే ఉన్నారు. వారి గురించి అందరికీ తెలుసు. కనుక మళ్ళీ పేర్లు చెప్పుకోనవసరం లేదు.

ADVERTISEMENT

చాలా మంది ఎవరో ఒకరి స్పూర్తితో జీవితంలో రాణిస్తే, ఒకప్పుడు పప్పు, మొద్దబ్బాయని వైసీపీ నాయకుల చేత తీవ్రంగా అవహేళన చేయబడిన నారా లోకేష్‌ వాటి నుంచే పాఠాలు నేర్చుకోవడం విశేషం.

సాధారణంగా ఆ స్థాయి వ్యక్తి అంతగా అవహేళనలకు గురైనప్పుడు రెండే ఆప్షన్స్ ఉంటాయి. 1. ముఖ్యమంత్రి కొడుకు కనుక పార్టీ, ప్రభుత్వం, పోలీసులు, మంత్రులు, ప్రజా ప్రతినిధులు సాయంతో ఎదురుదాడి చేయిస్తూ తన లోపాలు కప్పి పుచ్చుకోవడం. ఈ రోజుల్లో ఇలా చేసేవారే చాలా ఎక్కువున్నారు. 2. రాజకీయాలకు గుడ్ బై చెప్పేసి హాయిగా తమ ఫ్యామిలీ బిజినెస్‌లు చూసుకుంటూ జీవితాన్ని ఎంజాయ్ చేయడం.

కానీ నారా లోకేష్‌ ఈ రెండు ఆప్షన్స్ ఎంచుకోలేదు. మూడో ఆప్షన్ ఎంచుకున్నారు!

ముఖ్యమంత్రి కొడుకు అయినప్పటికీ ఏమాత్రం సంకోచించకుండా ఆ అవహేళనలతోనే తనలో లోపాలను గుర్తించి అంగీకరించారు. ఒకటొకటిగా వాటన్నిటినీ సరిచేసుకున్నారు. ఎర్రటి కొలిమిలో కాల్చి సాన పెట్టిన కత్తిలా మారి ‘యువగళం’ వినిపించారు.

నారా లోకేష్‌లో ఆ మార్పు చూసిన వైసీపీ నేతలు బహుశః నేటికీ లోలోన పశ్చాతాపపడుతూనే ఉంటారు. అవహేళన చేసి ఆయన ఆత్మవిశ్వాసం దెబ్బ తీసి రాజకీయాల నుంచి దూరంగా పారిపోయేలా చేయాలనుకుంటే, నారా లోకేష్‌ తనని తాను తీర్చిదిద్దుకొని ప్రజల మన్ననలు పొందడమే కాకుండా, ‘రెడ్ బుక్’తో తమకే పక్కలో బల్లెంలా మారారని వైసీపీ నేతలు లోలోన అనుకోకుండా ఉంటారా?

ఈ వయసులో కూడా ఎంతో సమర్ధంగా, చురుకుగా పనిచేస్తున్న సిఎం చంద్రబాబు నాయుడుని చూసే అసూయతో రగిలిపోతున్న వైసీపీ అధినేత జగన్‌, ఆ పార్టీ నేతలు నారా లోకేష్‌ తెలుగుదేశం కార్య నిర్వాహక అధ్యక్షుడుగా నియమితులవడం దేనికో అర్థం చేసుకోగలరు.

కానీ ఆయన రాజకీయ ఎదుగుదలని జీర్ణించుకోగలరా? అడ్డుకోగలరా? అసలు నారా లోకేష్‌ ఈ స్థాయికి ఇంత వేగంగా ఎదగడానికి తామే పరోక్షంగా తోడ్పడి చేజేతులా కొరివితో తల గోక్కోన్నామని బాధ పడకుండా ఉంటారా?

జగన్‌ గొప్ప గొప్ప వ్యూహాలు రచిస్తుంటారు. కానీ దేవుడి స్క్రిప్ట్ అంత కంటే చాలా గొప్పగా, భిన్నంగానే ఉంటోంది ఎప్పుడూ!

నారా లోకేష్‌ని రాజకీయాల నుంచి తరిమేసి చంద్రబాబు నాయుడుకి రాజకీయ వారసుడు లేకుండా చేసి అధికారం చేజిక్కించుకోవచ్చని జగన్‌ అనుకున్నారు. కానీ జగన్‌ స్వయంగా నారా లోకేష్‌కి సానపట్టి ముఖ్యమంత్రి పదవికి పోటీగా తెచ్చుకున్నారు కదా?

సిఎం చంద్రబాబు నాయుడు ముసలోడు… వయసైపోయింది. ఇంక కృష్ణా రామా అనుకుంటూ ఇంట్లో కూర్చోక తప్పదు. ఈ రాష్ట్రానికి నా వంటి యువ నాయకత్వం చాలా అవసరమని వైసీపీ అధినేత జగన్‌ (53) వాదిస్తుంటారు.

కానీ ఇప్పుడు వయసులో తన కంటే పదేళ్ళు చిన్నవాడు, తెలుగులో అనర్గళంగా మాట్లాడటంతో సహా తన కంటే అన్ని విధాల సమర్ధుడని నిరూపించుకుంటున్న మంత్రి నారా లోకేష్‌ (43) ముఖ్యమంత్రి పదవికి పోటీగా రావడం జగన్‌కి పెద్ద షాకే కదా?

జగన్‌ కంటే నారా లోకేష్‌ వయసులో పదేళ్ళ చిన్నవాడు. కనుక ఇప్పుడు ప్రజలే జగన్‌ని వృద్ధుడని అనకుండా ఉంటారా? అంటే తట్టుకోగలరా? ఇవన్నీ స్వయంక్రుతం కావా?

చివరిగా ఒక మాట: చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌ రాజకీయ ప్రాబల్యం, ఎదుగుదలని చూసి అసూయ పడే బదులు, వారి స్పూర్తితో తమలో లోపాలు, అవలక్షణాలు వదిలించుకోగలిగితే వారికే మంచిది.

ADVERTISEMENT
Latest Stories