పార్టీ అధికారంలో ఉండి, తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ప్రత్యర్థి పార్టీల నుండి విమర్శలు ఎదుర్కున్న నారా లోకేష్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే రాజకీయాలలో రాటుతేలారని ప్రత్యర్థులు సైతం ఒప్పుకుంటున్నారు. ఒకప్పుడు ప్రచారానికి సైతం తడబడే నారా లోకేష్ ఇప్పుడు తన వాగ్దాటితో ప్రత్యర్థులనే కాదు ప్రత్యర్థి మీడియాను సైతం వెనకడుగు వేసేలా చేస్తున్నారు.
ప్రజలకు చేరువకావడానికి, ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకోవడానికి,ఒక నాయకుడిగా ప్రజలలో గుర్తింపు సంపాదించడానికి పాదయాత్రలు ఎంతటి మేలుచేస్తాయనేది గత రాజకీయ చరిత్రను పరిశీలిస్తే అర్ధమవుతుంది.ఇప్పుడు లోకేష్ విషయంలో కూడా అదే జరిగింది. ప్రజలతో లోకేష్ మమేకమవుతున్న తీరు టీడీపీ క్యాడర్ కు బలాన్ని చేకూర్చి పెడుతుంది. రాజశేఖర్ రెడ్డి మొదలు చంద్రబాబు, జగన్ ఇలా ప్రతి నాయకుడు కూడా పాదయాత్రలతోనే తమ లక్ష్యాలకు చేరువయ్యారు.
జనవరి 27 కుప్పంలో మొదలైన లోకేష్ యువగళం పాదయాత్ర నేటితో కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం రాజుల కొత్తూరు వద్దకు చేరి మూడు వేల కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో నారాలోకేష్ ఫైలాన్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో లోకేష్ తో పాటు ఆయన భార్య బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్, బాలకృష్ణ తనయుడు, చిన్నల్లుడు నందమూరి మోక్షజ్ఞ, భరత్ లు పాల్గొన్నారు.వైసీపీ ప్రభుత్వం నుండి ఎన్నిఒడిదుడుకులు ఎదురైనా సమయం తీసుకుని మళ్ళీ తానూ చేపట్టిన యువగళంను కొనసాగిస్తూనే ఉన్నారు లోకేష్.
మూడు వేల కిలోమీటర్ల పాదయాత్రతో ఎన్నో ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకోవడంలో, ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు భరోసా కల్పించడంలో లోకేష్ అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నారు.ఇక్కడ ఎన్ని కిలోమీటర్లు నడిచాం అన్నది ముఖ్యం కాదు ఎంతమంది ప్రజల మన్నలు పొందాం, అలాగే ఎంతమంది నమ్మకాన్ని సాధించాం అనేదే కీలక అంశం.




