Nellore-TDP-Nara-Lokeshటిడిపి యువ నేత నారా లోకేష్ ప్రస్తుతం బద్వేల్ నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర చేస్తున్నారు. మంగళవారం ఆయన నెల్లూరు జిల్లాలోని ఉదయగిరిలో ప్రవేశించబోతున్నారు. అయన కోసం టిడిపి శ్రేణులు ఎదురుచూడటం, ఎదురేగి ఘనస్వాగతం పలకడం సహజమే.

కానీ తొలిసారిగా ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు వైసీపీ నుంచి సస్పెండ్ అయిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఎదురుచూస్తున్నారు. వారే ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. వారు ముగ్గురూ టిడిపిలో చేరేందుకు సంసిద్దత వ్యక్తం చేశారు.

Also Read – వీళ్ళు పాక్ మంత్రులా.. ఉగ్రవాదులా?

వారిలో ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి శుక్రవారమే హైద‌రాబాద్‌ వెళ్లి చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యి వచ్చారు. నారా లోకేష్‌కు తన నియోజకవర్గంలో ఘనస్వాగతం పలికి సంఘీభావం తెలియజేస్తానని అన్నారు. నారా లోకేష్‌ నెల్లూరులో పాదయాత్ర చేస్తున్నప్పుడే టిడిపిలో చేరుతానని ఆనం రామనారాయణ రెడ్డి ప్రకటించారు.

ఈరోజు ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కూడా తాను టిడిపిలో చేరేందుకు సిద్దంగా ఉన్నానని ప్రకటించారు. నారా లోకేష్‌కు ఉదయగిరిలో ఘనస్వాగతం పలికి ఆయన పాదయాత్రను విజయవంతం చేస్తానని చెప్పారు. టిడిపి టికెట్ ఇస్తే పోటీ చేస్తానని, లేకున్నా వచ్చే ఎన్నికలలో వైసీపీని ఓడించేందుకు టిడిపి కోసం పనిచేస్తానని అన్నారు. నారా లోకేష్‌ పాదయాత్రలో లేదా తర్వాత టిడిపిలో చేరుతానని మేకపాటి చెప్పారు.

Also Read – ఉగ్రవాదులు శ్రీనగర్‌లోనే ఇళ్ళు కట్టుకు నివసిస్తున్నా…

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఈరోజు ఉదయం టిడిపి నేతలు కలిసి పార్టీలో చేరవలసిందిగా ఆహ్వానించారు. అందుకు ఆయన అంగీకరించారు. ఆయన కూడా జిల్లాలో నారా లోకేష్‌ పాదయాత్ర సాగుతున్నప్పుడు లేదా ముగిసేలోగా టిడిపిలో చేరుతానని ప్రకటించారు.

నారా లోకేష్‌ ఇంతవరకు పలు జిల్లాలు, నియోజకవర్గాల గుండా 1,5౦౦ కిమీ పైగా పాదయాత్ర చేశారు. కానీ తొలిసారిగా ముగ్గురు విపక్షపార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు అయనకు స్వాగతం పలికి పార్టీలో చేరేందుకు ఎదురుచూస్తున్నారు.

Also Read – వైసీపీ చేపల వేట ఫలించేనా?

వారు ముగ్గురినీ వైసీపీలో నుంచి సస్పెండ్ చేసినందున ఈ పరిణామాలు ఆ పార్టీ ముందే ఊహించి ఉండవచ్చు కానీ జీర్ణించుకోవడం కాస్త కష్టమే. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలతో పాటు వారి అనుచరులు ఎలాగూ టిడిపిలోకి వెళ్ళిపోతారు. వారితో పాటు ఇంకెవరూ వెళ్ళిపోకుండా కాపాడుకోవాల్సి ఉంటుంది.

వైసీపీలో బలమైన నేతలుగా ఉండే వీరు ముగ్గురిని బయటకు పంపించి పెద్ద తప్పు చేసిందని చెప్పవచ్చు. గత ఎన్నికలలో వైసీపీ గాలి వీచింది కనుక జిల్లాలో పదికి పది స్థానాలు వైసీపీ గెలుచుకొంది. కానీ వచ్చే ఎన్నికలలో అటువంటి పరిస్థితి ఉండదు. కనుక ఒకే జిల్లాలో ముగ్గురు బలమైన నేతలను చేజేతులా టిడిపికి అప్పగించి, కూర్చొన్న కొమ్మను నరుకొన్నట్లే భావించవచ్చు.