చంద్రబాబుని తిట్టేందుకు పోటీ పడతారు… కానీ రైతులను పట్టించుకోరా?

Nara Lokesh Padayatraటిడిపి యువనేత నారా లోకేష్‌ యువగళం 86వ రోజున నేడు కర్నూలు జిల్లా, ఎమ్మిగనూరు నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు. ఇన్ని రోజులు మండుటెండల్లో పాదయాత్ర చేసిన నారా లోకేష్‌ ఇప్పుడు జడివానలో సైతం పాదయాత్ర కొనసాగిస్తుండగా, వేలాదిమంది ప్రజలు ఆయన వెంటనడుస్తుండటం విశేషం.

ఎప్పటిలాగే ఈరోజు ఉదయం పాదయాత్ర మొదలు పెట్టి దారిలో కడిమెట్ల ఫక్రీ సాదర్ చౌక్ వద్ద, తర్వాత రాళ్ళదొడ్డివద్ద బీసీలతో సమావేశమయ్యి వారి సమస్యలను అడిగితేలుసుకొన్నారు. అకాల వర్షాలతో మొక్కజొన్న తదితర పంటలు దెబ్బతిన్నాయని కానీ ప్రభుత్వంలో పట్టించుకొనే నాధుడే లేడని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కో ఎకరానికి సుమారు రూ.90వేలు పెట్టుబడి పెట్టి మొక్కజొన్న వేస్తే, చేతికి అందివచ్చిన పంట మొత్తం ఒక్కరోజులో తుడిచిపెట్టుకుపోయిందని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేశారు. నారా లోకేష్‌ వారికి ధైర్యం చెప్పి పంట నష్టం చెల్లింపు కోసం రాష్ట్ర ప్రభుత్వంపై టిడిపి ఒత్తిడి చేస్తుందని హామీ ఇచ్చారు.

ADVERTISEMENT

ఈ సందర్భంగా నారా లోకేష్‌ ప్రజలను ఉద్దేశ్యించి ప్రసంగిస్తూ, “చంద్రబాబు నాయుడుని, మా తెలుగుదేశం పార్టీ నేతలని తిట్టిపోయడానికి మంత్రులు పోటీలు పడుతుంటారు. కానీ అకాలవర్షాలతో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి మీలో ఎవరికీ తీరిక లేదా? రైతులు ఇంతగా ఆవేదన చెందుతుంటే ముఖ్యమంత్రికి లేదా వ్యవసాయమంత్రికి వారిని పరామర్శించే తీరిక,ఆసక్తి లేవా? రైతుల కోసం వేలు, లక్షల కోట్లు ఖర్చుపెడుతున్నామని గొప్పలు చెప్పుకొంటుంటారు కదా… మరిప్పుడెందుకు ఎవరూ ముందుకు వచ్చి రైతులను ఆదుకోవడం లేదు?ఇంకా ఎంతకాలం రైతులు మీ కోసం ఎదురుచూడాలి?” అంటూ నారా లోకేష్‌ ప్రశ్నించారు.

ఈ సందర్భంగా నారా లోకేష్‌ తాను ఎస్సీలను అవమానించానంటూ వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండించారు. “ఒకవేళ నేను సభలో ఎస్సీ, బీసీలను అవమానిస్తూ మాట్లాడితే వారెందుకు చప్పట్లు కొడతారు జగన్‌ రెడ్డీ?నా గురించి తప్పుడు ప్రచారం చేసేటప్పుడు ఇంత చిన్న విషయం సరిచూసుకోలేకపోయావు. నేను ఎస్సీ, బీసీలను అవమానించిన్నట్లు నిరూపించగలరా?నిరూపిస్తే నేను రాజకీయాల నుంచి శాస్వితంగా తప్పు కొంటాను లేకుంటే నా గురించి తప్పుడు ప్రచారం చేసినందుకు నీ సాక్షి మీడియా ద్వారానే క్షమాపణలు చెప్పుకొని దానిని మూసివేస్తావా?” అంటూ నారా లోకేష్‌ సవాలు విసిరారు.

జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ మొన్న హైదరాబాద్‌లో చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళి భేటీ అయినందుకే వైసీపీ మంత్రులు ఎంతగా కడుపు మంటతో రగిలిపోయారో అందరూ చూశారు. వారి కడుపుమంటలను రాజేస్తున్నట్లు, ఈరోజు జనసైనికులు జండాలు పట్టుకొని తరలివచ్చి నారా లోకేష్‌కు సంఘీభావం తెలియజేశారు. టపాసులు పేల్చి నారా లోకేష్‌కు ఘన స్వాగతం పలికారు. తద్వారా టిడిపి, జనసేనలు కలిసి పనిచేయాలని కోరుకొంటున్నామని, పనిచేయబోతున్నాయని స్పష్టమైన సంకేతం ఇచ్చారు. నారా లోకేష్‌ వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, అభివాదం చేసి ముందుకు సాగారు… మరో మైలురాయిని అధిగమించేందుకు!

ADVERTISEMENT
Latest Stories