నారా రోహిత్ హీరోగా నటిస్తున్న “తుంటరి” సినిమా తొలి టీజర్ విడుదలైంది. ఒక్క డైలాగ్ కూడా లేకుండా విడుదలైన ఈ టీజర్ లో ప్రధాన ఆకర్షణ నేపధ్య సంగీతం. సినిమాపై ఆసక్తి పెంచేలా సాయి కార్తీక్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదరగొట్టింది. మునుపటి సినిమాలతో పోల్చుకుంటే నారా రోహిత్ లుక్ కాస్త డిఫరెంట్ గా కనపడుతున్నాడు. పోలీస్ గెటప్ లలో చూసి ఉన్న ప్రేక్షకులకు ఈ ఫ్రెష్ లుక్ ఆకట్టుకుంటుంది. అయితే ఒక హీరోకు కావాల్సిన ఫిజిక్ ను మైంటైన్ చేయడంలో నారా రోహిత్ విఫలమవుతున్నారనేది కాదనలేని సత్యం.
బాక్సింగ్ నేపధ్యంలో సాగే ఈ కధను ప్రముఖ తమిళ దర్శకుడు మురుగదాస్ అందించారు. ఈ సినిమాకున్న ప్రధాన ఆకర్షణలలో ఇది కూడా ఒకటి. మురుగదాస్ కధలు సాధారణంగా సామాజిక అంశాలతో మిళితమై ఉంటాయి. దీంతో “తుంటరి” సినిమాపై అంచనాలు ఏర్పడడానికి అవకాశం కలిగింది. ‘గుండెల్లో గోదావరి’ ఫేం కుమార్ నాగేంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఫిబ్రవరి చివరి వారంలో గానీ, మార్చి మొదటి వారంలో గానీ విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.





