చిలకలూరిపేటలో ప్రధాని మోడీ… చెప్పాల్సింది చాలానే ఉంది!

Chandrababu-Naidu-Pawan-Kalyan-Narendra-Modi

ఈ నెల 17వ తేదీన చిలకలూరిపేటలో టిడిపి, జనసేనలు కలిసి ఉమ్మడిగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసుకొని ఉమ్మడి మ్యానిఫెస్టో ప్రకటించాలనుకున్నాయి. ఈలోగా వాటితో బీజేపీ పొత్తు ఖరారవడంతో చిలకలూరిపేట సభలో బీజేపీ కూడా భాగస్వామి అయ్యింది.

ADVERTISEMENT

ఈ సభలో ప్రధాని నరేంద్రమోడీ పాల్గొంటారని ప్రధాని కార్యాలయం నుంచి చంద్రబాబు నాయుడుకి ఈరోజే సమాచారం వచ్చింది. దీంతో ఈ సభ స్థాయి మరింత పెరిగినట్లయింది.

ప్రధాని నరేంద్రమోడీ ఈ సభలో పాల్గొనబోతుండటంతో ఏపీ బీజేపీ నేతలందరూ కూడా సభని విజయవంతం చేసే బాధ్యత తీసుకొని పనిచేయడం మొదలుపెట్టారు.

దీని కోసం మూడు పార్టీల నేతలతో కలిపి మొత్తం 13 కమిటీలను ఏర్పాటు చేసుకున్నాయి. నేడు ఉండవల్లిలో చంద్రబాబు నాయుడు నివాసంలో ఈ కమిటీల సభ్యులతో టిడిపి యువనేత నారా లోకేష్‌ సమావేశమయ్యి సభ ఏర్పాట్ల గురించి చర్చించారు.

2014 ఎన్నికలప్పుడు, రాజధాని అమరావతికి భూమిపూజ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు, నరేంద్రమోడీ, పవన్‌ కళ్యాణ్‌ ముగ్గురూ ఒకే వేదికపై కనిపించారు. ఆ తర్వాత కధ అందరికీ తెలిసిందే. మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత ముగ్గురూ ఒకే వేదికపై నుంచి రాష్ట్ర ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడబోతున్నారు.

చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌ ఏమి చెపుతారో ప్రజలు ఊహించగలరు. కానీ రాష్ట్ర వినాశనం తర్వాత తొలిసారిగా ప్రధాని నరేంద్రమోడీ పూర్తి భిన్నమైన రాజకీయ ధోరణితో ఈ సభలో పాల్గొనబోతున్నారు. కనుక ఈ వేదికపై నుంచి ఆయన ఏమి చెపుతారనేది చాలా ఆసక్తికరం.

అమరావతి రాజధానికి బీజేపీ కట్టుబడి ఉందని దగ్గుబాటి పురందేశ్వరి పదేపదే చెపుతున్నారు కనుక దానిపై ఈ సభలో ప్రధాని నరేంద్రమోడీ నిర్ధిష్టమైన హామీ ఇవ్వాల్సి ఉంది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని ఏవిదంగా ఆదుకుంటారో చెప్పాల్సి ఉంది.

ముఖ్యంగా వైసీపి, జగన్మోహన్‌ రెడ్డి పట్ల తమ వైఖరిలో నిజంగానే మార్పు వచ్చిందని, దానికి తాము కట్టుబడి ఉంటామని ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు నమ్మకం కల్పించాలి ఉంటుంది.

అందుకోసం వివేకా హత్య కేసు, జగన్‌ అక్రమస్తుల కేసులలో తమ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో చెప్పగలగాలి.

టిడిపి, జనసేనలు బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నాయో అందరికీ తెలుసు. కనుక ఎన్నికల సమయంలో వైసీపి మూకలు పెట్రేగిపోకుండా కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘాల ద్వారా పూర్తిగా నియంత్రిస్తామనే నమ్మకం కలిగించాలి.

ఈ విషయం టిడిపి, జనసేనలతో బీజేపీ పొత్తుకున్నప్పుడే కేంద్ర ఎన్నికల కమీషన్‌కు అర్దమై ఉండాలి. ఇప్పుడు ఈ సభకు మోడీ రాకతో రాష్ట్ర ఎన్నికల సంఘానికి కూడా అర్దమయ్యే ఉండాలి. కనుక ముందుగా ఈ మార్పు కనిపించేలా చేయాల్సిన బాధ్యత ప్రధాని నరేంద్రమోడీ, ఏపీ బీజేపీలపైనే ఉంది.

ఇది కాక వైజాగ్ స్టీల్ ప్లాంట్‌, విశాఖ రైల్వే జోన్, పారిశ్రామికాభివృద్ధి వంటి అనేక అంశాలపై ప్రధాని నరేంద్రమోడీ ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు నమ్మకం కలిగించగలిగితేనే ఈ పొత్తులలో టిడిపి, జనసేనల ఓట్లు బీజేపీకి బదిలీ అయ్యే అవకాశం ఉంటుంది. లేకుంటే ఎన్నికల తర్వాత బీజేపీ కూడా తట్టాబుట్టా సర్దుకు పోక తప్పదు.

ADVERTISEMENT
Latest Stories