ప్రస్తుతం దేశంలో ఒకే సమయంలో సమాంతరంగా కొన్ని ఆసక్తికర పరిణామాలు జరుగుతున్నాయి. 1.నీట్ అంశంపై విద్యార్ధులు ఆందోళనలు, 2.నీట్ వ్యవహారంపై ప్రతిపక్షాల రాజకీయాలు, 3. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై తర్జనభర్జనలు, 4. నీట్ అంశంపై దేశవ్యాప్తంగా బిజేపి నేతల వాదనలు, ఎదురుదాడులు, 5. ఈ అంశంపై సినీ ప్రముఖుల అభిప్రాయాలు, 6. వాటిని సమర్ధిస్తూ, వ్యతిరేకిస్తూ సోషల్ మీడియాలో వాదోపవాదాలు.
వీటన్నిటి గురించి ఇప్పటికే చాలా విన్నాము. అయితే ఇలాంటి సందర్భాలలో సినీ నటులు ఎటువంటి సమస్య ఎదుర్కొంటారో నటుడు నవదీప్ చెప్పిన మాటలు చాలా ఆసక్తి కలిగిస్తాయి.
‘”ఈ విషయంలో ప్రభుత్వానిది తప్పంటే యాంటీ నేషనలిస్ట్ అంటారు. స్టూడెంట్స్‌ది తప్పంటే పెయిడ్ ఆర్టిస్టులు అంటారు. అభిప్రాయం చెబితే నీకేం తెలుసు అంటారు. చెప్పకపోతే నువ్వేం చేయలేదు.. నీకెందుకు అంటారు. అసలు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఏమిటి? డెమోక్రసీ అంటే ఏమిటి? ఇప్పుడు మాట్లాడాలా మౌనంగా ఉండాలా? ఏం చేయాలి మేము?” అని నవదీప్ ప్రశ్నించారు. నవదీప్ ఈ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
నవదీప్ అడిగిన ఈ ప్రశ్నలు సినీ పరిశ్రమలో సెలబ్రెటీల పరిస్థితికి అద్దం పడుతున్నట్లుంది.
ఉదాహరణకు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, మొదట విద్యార్ధులకు మద్దతుగా మాట్లాడినప్పుడు ఆయనని చాలా మంది తప్పు పట్టారు. తర్వాత ఈ సమస్య పరిష్కారం చేసే బాధ్యతని ప్రభుత్వానికి విడిచిపెట్టి ఆందోళనలు విరమించాలని కోరినప్పుడు మళ్ళీ చాలా మంది తప్పు పట్టారు. కనుక ఇలాంటి సందర్భాలలో సెలబ్రెటీల మాట్లాడినా తప్పే మాట్లాడకపోయినా తప్పే.
హృతిక్ రోషన్, శేఖర్ కమ్ముల, జ్యోతిక వంటి కొందరు సెలబ్రెటీలు ఈ విషయంలో విద్యార్ధులకు మద్దతుగా ట్వీట్ చేశారు. కానీ తెలుగు సినీ పరిశ్రమలో చాలా మంది ప్రముఖులు ఈ అంశంపై స్పందించకుండా మౌనంగా ఉండిపోయారు. ఎందుకంటే నవదీప్ చెప్పారుగా!






