ప్రజలు సైబర్ నేరగాళ్ళ బారిన పడకుండా తప్పించుకోవడం అంటే మొసళ్ళ చెరువులో చేపలు జీవించడం వంటిదే అని చెప్పవచ్చు. ప్రతీ అవకాశాన్ని వినియోగించుకుంటూ ప్రజలను దోచుకుంటూనే ఉన్నారు. ఇందుకు చిన్న ఉదాహరణగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు నమోదు చేసిన ఈ కేసు కనిపిస్తోంది.
ఎస్‌బీఐలో పనిచేసి రిటైర్ అయిన ఓ మహిళ నగరంలో బాచుపల్లిలో వసంత నగర్‌లో నివసిస్తున్నారు. ఇటీవల ఆమె నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ రీఛార్జ్ చేసుకునేందుకు గూగుల్లో వెతికి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ కస్టమర్ కేర్ నంబరుకు ఫోన్ చేసి రీఛార్జ్ చేయాలనుకుంటున్నట్లు చెప్పారు.
వెంటనే అవతలి వ్యక్తి స్పందిస్తూ తన పేరు దీపక్ కుమార్ అని పరిచయం చేసుకొని, ఓ లింక్ పంపిస్తాను దానిలో మీ వివరాలు నింఫై పంపాలని కోరాడు. అతను పంపిన ఆ లింకు ఓపెన్ చేసి దానిలో ఆమె తన వివరాలు నింపారు. తర్వాత దీపక్ కుమార్ మళ్ళీ ఆమెకు వాట్సప్ కాల్ చేసి, రీఛార్జ్ ప్రక్రియ కోసం స్క్రీన్ షేరింగ్ ఆప్షన్ ఎంచుకోవాలని సూచించాడు.
ఆ ప్రకారమే చేయగా ఆ తర్వాత ఆమె మోబిఅల్ ఫోన్‌కు వరుసగా కొన్ని ఓటీపీలు వచ్చాయి. అవి బహుశః నెట్‌ఫ్లిక్స్ రీ ఛార్జ్ పేమెంట్ కోసం వస్తున్న ఓటీపీలే ఆమె అనుకున్నారు. కానీ 15 నిమిషాల తర్వాత ఆమె బ్యాంక్ అకౌంట్‌లో నుంచి నాలుగు లక్షలు విత్ డ్రా అయినట్లు మెసేజ్ రావడంతో ఆమె ఆందోళన చెంది దీపక్ కుమార్‌కి ఫోన్ చేయగా ఫోన్ స్విచ్చాఫ్ వచ్చింది.
దాంతో తాను మోసపోయానని అర్దమై సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు చేసింది. వారు కేసు నమోదు చేసుకొని దీపక్ కుమార్ ఖాతాకు బదిలీ అయిన సొమ్ముని ఫ్రీజ్ చేసి వెనక్కు రప్పించే ప్రయత్నం చేస్తున్నారు.
సైబర్ క్రైమ్ నేరగాళ్ళు ప్రధానంగా వృద్ధులు, మహిళలు ముఖ్యంగా గృహిణులు, ఎప్పుడూ బిజీబిజీగా గడిపే సాఫ్ట్‌వేర్ ఉద్యోగులను టార్గెట్ చేసుకొని మోసాలు చేస్తుంటారని కనుక ఆన్‌లైన్‌లో జరిగే ఇటువంటి మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ముఖ్యంగా నెట్ బ్యాంకింగ్ సౌకర్యం కలిగిన మొబైల్ ఫోన్లని చిన్న పిల్లల చేతికి ఇవ్వరాదని, దాని పట్ల అవగాహన లేని పెద్దవారి ఫోన్లలో నెట్ బ్యాంకింగ్ లాక్ చేసి ఉంచడం లేదా పూర్తిగా తొలగించడం మంచిదని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు.





