రాజకీయాలలో ఒక సమస్య లేదా అంశం మీద నుంచి మరో దానికి చర్చ, ప్రజల దృష్టిని ఎంత అలవోకగా మార్చవచ్చో తెలంగాణలో జరుగుతున్న తాజా రాజకీయాలు చూస్తే అర్ధమవుతుంది.
మొదట రేవంత్ ప్రభుత్వం హామీల అమలులో వైఫల్యం, మంత్రుల కమీషన్లు అంటూ బీఆర్ఎస్ విమర్శలు.
తర్వాత కొండా సురేఖ ఎపిసోడ్స్. ఆ తర్వాత నిషేదిత 22ఏ పేరుతో కాంగ్రెస్ మంత్రులు భూదోపిడీకి పాల్పడుతున్నారనే బీఆర్ఎస్ ఆరోపణలు. శాసనసభ సమావేశాలప్పుడు బయట కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మద్య జరిగిన వీధి పోరాటాలు. ఇలా ఒక దాని నుంచి మరో దానికి మారుతూ రెండు పార్టీలు రాష్ట్ర ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేశాయి.
వాటి నుంచి తేరుకునేలోగా సిఎం రేవంత్ నిన్న శాసనసభలో కేసీఆర్ భూములు అంటూ మరో బాంబు పేల్చారు. కేసీఆర్ కుటుంబం దోచుకోవడమే కాకుండా అందరికీ దోచిపెట్టారని సిఎం రేవంత్ ఆరోపించారు.
ఇది బీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ రాజకీయాలలో పెను విస్పోటనమే సృష్టించింది. కనుక హరీష్ రావు, కేటీఆర్ వెంటనే సిఎం రేవంత్ రెడ్డిపై ఎదురుదాడి మొదలుపెట్టారు. కనుక మద్య జరుగబోయే యుద్దాలతో ఎవరెవరు ఎన్ని వందలు లేదా వేల ఎకరాలు కొల్లగొట్టారనే విషయం బయటపడుతుంది.
ఆ తర్వాత సవాళ్ళు, ప్రతి సవాళ్ళతో తెలంగాణ దద్దరిల్లిపోతుంది. కనుక ప్రజలు కూడా తమ సమస్యలు మరిచి ఈ రెండు పార్టీలు సృష్టించిన రాజకీయ సునామీలో కొట్టుకుపోతారు. కానీ ఈ సునామీ సృష్టించిన సిఎం రేవంత్ రెడ్డి ఒడ్డున పడతారా లేక ఈ సునామీని అనుకూలంగా మలుచుకొని కేసీఆర్ పైచేయి సాధిస్తారా? అనేది మాత్రమే పాయింట్ తప్ప ఆక్రమిత భూములు స్వాధీనం కానే కాదు. కనుక మరో కొత్త సమస్య లేదా అంశం వచ్చే వరకు దీంతో రెండు పార్టీలు కాలక్షేపం చేసేయవచ్చు.
కానీ దీంతో రాజకీయంగా నష్టపోయేది ఎవరు? అనేది కూడా చాలా కీలకం. ఇదే తెలంగాణా రాజకీయాలను మార్చేస్తుంది.





