పెద్ద నోట్ల రద్దు తర్వాత 2000 రూపాయల నోటు విడుదలకు ముందు, ఈ నోటుపై ఎంత చర్చ జరగాలో అంత చర్చ జరిగింది. రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ఇందులో నానో చిప్ ను పెట్టిందని, దీంతో ఇది ఏ మూల నుండి ఏ మూలకు కదిలినా మొత్తం తెలిసిపోతుందని, అలాగే పెద్ద మొత్తంలో కరెన్సీ కట్టలను దాచే అవకాశం ఉండదని, ఇలా రకరకాలుగా జరిగిన ప్రచారాన్ని ఆర్బీఐ అధికారులు తిప్పికొడుతూ… అందులో ఏ మాత్రం నిజం లేదని చెప్పాయి.
అయితే చిప్ పెట్టాలనుకున్న మాట వాస్తవమే కానీ, అది చాలా ఖర్చుతో కూడుకున్నది కావడంతో… ఆ దిశగా అడుగులు పడలేదని ఆర్బీఐ వివరణ ఇచ్చుకుంది. అయితే చిప్ ఉంటే ఏం జరుగుతుందని భావించారో… ప్రస్తుతం చిప్ లేకపోయినా దేశవ్యాప్తంగా అదే జరుగుతోంది. 2000 రూపాయల కట్టలు ప్రతి రోజు కొన్ని వందల కోట్లల్లో బయట పడుతుండడం విస్మయానికి గురి చేస్తోంది. బ్యాంకు మేనేజర్లను అడ్డం పెట్టుకుని మార్చివేసిన కరెన్సీ కట్టలన్నీ ఒక్కొక్కటిగా వెలుగు చూస్తుండడం అవాక్కు చేస్తోంది.
ముఖ్యంగా నల్లకుభేరులు 2000 రూపాయల నోటు చూస్తేనే వణికిపోయే పరిస్థితి నెలకొంది. దీంతో తాజాగా 2000 రూపాయల నోటులో “ఏదో” ఉందని, దాని ద్వారానే ఆర్బీఐ అధికారులు ఈ నోట్లను గుర్తిస్తూ వీరందరినీ పట్టుకోగలుగుతున్నారన్న ప్రచారం ఊపందుకుంది. మరి ఇంతకీ ఈ నోటులో ఏం ఉంది? అంటే… నోటును ముద్రించడానికి ఉపయోగించిన ఇంకులో పీ-32 అనే రేడియోధార్మిక ఫాస్పరస్ ఐసోటోప్ ఉందనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఈ రేడియో ధార్మికత వల్లే చెన్నై, ఢిల్లీ, బెంగళూరు, పూణె, వెల్లూరు వంటి పెద్ద నగరాల్లో పెద్ద ఎత్తున కొత్త నోట్లను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారనే కథనాలు వెల్లువెత్తుతున్నాయి. ఒకే ప్రదేశంలో పెద్ద ఎత్తున పీ-32 అనే పదార్థం ఉంటే… వెంటనే దాన్ని గుర్తించవచ్చని… అందుకే 2000 విలువైన కొత్త నోట్లు ఎక్కువగా ఉన్న ప్రదేశాలన్నీ దొరికిపోయాయని, భారీగా కొత్త కరెన్సీని స్వాధీనం చేసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ రేడియోధార్మిక పదార్థం వల్ల ఎలాంటి అపాయం ఉండదని… ఆరోగ్యానికి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదని టాక్.
మరి ఇందులో ఎంత వాస్తవం ఉందో గానీ, 2000 రూపాయల కట్టలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇలా పెద్ద మొత్తంలో ఈ పెద్ద నోటును దాచుకున్న బడా బాబులను ముందుకు తీసుకువస్తే అయినా, ప్రజలు కాస్త శాంతిస్తారని ఇలా దాడులు చేస్తున్నారో లేక నిజంగానే ఒకే దగ్గర ఈ నోట్లు ఉంటే కనుగొనే శక్తిని కలిగి ఉన్నారో గానీ, సదరు వార్తలు మాత్రం ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మోడీ ప్రవేశపెట్టిన కొత్త నోటు మాత్రం కేక పెట్టిస్తోంది… అటు చిల్లర దొరకక సామాన్యుల చేత… ఇటు దొరికిపోతామని బడా బాబుల చేత…!



