మొత్తానికి తెలంగాణ ఎన్నికల సినిమా క్లైమాక్స్ పూర్తయ్యింది. సినిమా క్లైమాక్స్ తో తెలంగాణలో, కాంగ్రెస్ పార్టీలో సంబరాలు మొదలయ్యాయి. పార్టీ గెలుపు కోసం రేవంత్ పడిన కష్టానికి పూర్తి న్యాయం చేశారు అంటూ కాంగ్రెస్ అధిష్టాన నిర్ణయాన్ని అందరు స్వాగతిస్తున్నారు.
తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ ఎన్నికకావడంతో అటు తెలంగాణ తో పాటుగా ఇటు ఆంధ్రాలో కూడా సంబరాలు మొదలయ్యాయి. కాంగ్రెస్ పార్టీ గెలిచిన సందర్భంలోనే ఏపీలో తాడేపల్లి జగన్ ఇంటికి సమీపంలో తెలంగాణకు కాబోయే కొత్త ముఖ్యమంత్రి అంటూ రేవంత్ ఫ్లెక్సీలు దర్శనమివ్వడం ఇక్కడ గమనార్హం. గత ఎన్నికలలో తెరాస పార్టీ విజయం సాధించినప్పుడు కూడా పలువురు సభ్యులు తాడేపల్లిలో బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.అయితే అప్పుడు తెరాస గెలుపుకి ఇప్పుడు కాంగ్రెస్ గెలుపుకి సంబరాలు జరిగిన ప్లేస్ ఒక్కటే కానీ సంబరాలు చేసుకున్న పార్టీల మద్దతుదారులు వేరు సుమీ.!
ఇన్నాళ్లుగా రహస్య మిత్రులుగా కొనసాగుతూ అవసరమొచ్చినప్పుడల్లా రెండు రాష్ట్ర ప్రజల మధ్య భావోద్వేగాలు రెచ్చగొడుతూ ఒకరికొకరు సాయం చేసుకుంటూ ముందుకెళ్లిన జగన్, కేసీఆర్ ల బంధానికి రేవంత్ తో చెక్ పడినట్లే అనే భావనలో టీడీపీ శ్రేణులు ఉన్నారు. ఒకవేళ తెలంగాణ ఎన్నికలలో కేసీఆర్ తిరిగి విజయం సాధించినట్లయితే పాత మిత్రులతో కొత్త పథకాలు రచించి మళ్ళీ ఏపీలో వైసీపీ గెలుపుకి ప్రయత్నాలు జరిగేవని, కానీ ఇప్పుడు తెలంగాణ కు కొత్త ముఖ్యమంత్రి వచ్చారు.., ఇక కొత్త విధానాలు అమలవుతాయి..,అలాగే తెలంగాణ ప్రభుత్వానికి కొత్త మిత్రులు…వస్తారు అంటూ మీడియాలో చర్చలు మొదలయ్యాయి.
తెలంగాణలో ప్రభుత్వం మార్పుతో ఏపీలో కూడా రాజకీయ వాతావరణం ఒక్కసారిగా మారిపోనుంది అనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.రేవంత్ చంద్రబాబుకి అత్యంత సన్నిహితమైన వ్యక్తి కావడంతో ఇక ఏపీలో అసలైన రాజకీయ క్రీడ మొదలవ్వబోతుంది అంటూ బాబు ఫాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.అలాగే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తనపై కేసులు పెట్టి జైలుకి పంపి హేళన చేసిన నాయకుల పై ముఖ్యమంత్రి అయిన రేవంత్ ఇప్పుడు ఎలా ప్రవర్తిస్తారు? అనే చర్చ కూడా సామాజిక మాధ్యమాలలో చక్కర్లుకొడుతుంది.




