‘కొత్తపలుకు’, ‘వీకెండ్ కామెంట్’ ఆర్కే గా పిలుచుకునే ఆంధ్రజ్యోతి యండి రాధాకృష్ణ సమకాలీన తెలుగు, దేశ రాజకీయాలపై తన అనుభవాలతో కూడిన విశ్లేషణతో రాసే కాలమ్. ఆయన్ని తీవ్రంగా వ్యతిరేకించే వారూ ఈ వారం ఏం రాసారో అని ఆత్రుతగా ఎదురు చూస్తారు. కొన్ని శనివారాలు ఆ కాలమ్ ఉండనప్పుడు అభిమానులు, దురభిమానాలు కూడా అసంతృప్తితో నిట్టూరుస్తారు. పదే పదే ఆర్కే మీద ట్వీట్లలో విరుచుకుపడుతున్న విజయసాయి రెడ్డి వంటి పవర్ఫుల్ లీడర్ కు ఒక వారం కొత్తపలుకులో “నాకూ మీగురించి కలలు వస్తాయి, చెప్పమంటారా” అనే ఒక్క వాక్యంతో ఆయన కూత ఆపించినంత చురుకైన విశ్లేషణలు ఈ కాలమ్ సొంతం. రెండు వైపులా పదునున్న ఆ కాలమ్ లో ఎప్పుడు ఎవరి మీద ఉరుముతారో అని రాజకీయ నాయకులు బిక్కు బిక్కు మంటూ చూస్తారు.
ఈవారం కొత్తపలుకులో ఆయన నాలుగేళ్ళుగా డైలీ సీరియల్ లా సాగుతున్న జగన్ మెూహన్ రెడ్డి చిన్నాన్న వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించిన సంచలన విషయాలు రాసారు. “వివేకా హత్య జరిగిన రోజు ఉదయం 4.30 సమయంలో కల్లం అజయ్ రెడ్డి, కృష్ణమెూహన్ రెడ్డి, ఉమ్మారెడ్డి, దువ్వూరి కృష్ణతో సమావేశంలో ఉన్నారు, ఆ సమయంలో మేడ మీద నుంచి పిలుపు వచ్చింది, పది నిమిషాల తరువాత కిందకు వచ్చిన జగన్, చిన్నాన్న గుండెపోటుతో చనిపోయారని చెప్పి సమావేశం కొనసాగించారు” అని. ఇప్పటి వరకు వస్తున్న వార్తలు, లీకుల ప్రకారం వివేకా చావు విషయం ఉదయం ఆరు తరువాత తెలిసింది అనేది. అటువంటిది మీడియాకు, పులివెందుల స్ధానికుల కంటే ముందే జగన్ కుటుంబానికి దీని గురించి తెలుసు అనేది సంచలన విషయం.
అది ఇప్పుడు వేళ్లను జగన్ దంపతుల వైపు చూపిస్తుంది. అలాగే “ఈ కేసులో మెుదటిసారిగా జగన్ రెడ్డి సతీమణి భారతీ రెడ్డిపై అనేక చూపుడు వేళ్ళు గురిపెట్టి ఉన్నాయి. ఆమె పాత్రపై జనం అనుమానంగా చూస్తున్నారు.” అంటూ ప్రజల్లో ప్రచారంలో ఉన్న మాటలను కాలమ్ లో రాసారు. నిజానికి ఇవి రాయాలంటే మామూలు ధైర్యం సరిపోదు, టన్నుల కొద్దీ కావాలి. కనిపించీ కనిపించకుండా, వినిపించీ వినిపించకుండా సోషల్ మీడియాల్లో పెట్టే పోస్టులకే అర్దరాత్రి అరెస్టులు చేసి హింసించి జైలుకు పంపుతున్నారనే ఆరోపణలు కోకొల్లలు. ఇక ఆంధ్రజ్యోతి వంటి గిట్టని మీడియాల కట్టడి కోసం ప్రభుత్వం ఏర్పడిన ఐదు నెలలకే జివో 2430 తెచ్చారనే వాదనలు. ఇటువంటి పరిస్ధితుల్లో పేర్లతో సహా ఆ ఉదంతం గురించి రాయడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. బహూశా ఆయనకు అంత బలమైన ఆధారాలు ఉండటం వల్లే ఆవిషయాలు వెల్లడించారేమెూ.
రాధాకృష్ణ కొత్తపలుకు మీద కౌంటర్ ఇవ్వడానికే ప్రత్యేకంగా కొందరు వైసిపి సోషల్ మీడియా వ్యక్తులు, ఆ పార్టీకి అనుకూలంగా ముచ్చటించే కొన్ని వెబ్ సైట్లు పనిచేస్తాయి. వారిలో కొందరు తమ జగన్ రెడ్డి మీద ఈగ వాలనివ్వని వర్గపోరాట వాదులైతే, మరికొందరు రేటు కట్టి వాదనలు రాసే క్యాపిటలిస్టులు. కొత్తపలుకు వచ్చిన గంటల్లోనే వాళ్ళు దీనికి కౌంటర్ గా నిజం లాంటి అబద్దాలో, అవీ లేకపోతే బూతులో తిడుతూ పోస్టులు, వీడియెూలు పెడతారు. కానీ నిన్నటి వీకెండ్ కొత్తపలుకులకు అసలు వైసిపి కాంప్ నుంచి సౌండ్లు రావడం లేదంటే అవి వాళ్లను ఎంత డిఫెన్స్ లో పడేసాయెూ అర్దం అవుతుంది. కాదంటే రేపు సిబిఐ విచారణ చేసి గూగుల్ చేకవుట్ వంటి టెక్నాలజీతో వారి సమావేశం వివరాలు వెల్లడిస్తారేమెూ, ఔనంటే జగన్ దంపతుల పాత్ర ఒప్పుకోవాలేమెూ అని అడకత్తెరలో పడిపోయారు. ఈవారం ఆర్కే పలుకులకు సమాదానం ఎప్పటికి వస్తుందో, వైసిపి నుంచి వస్తుందా లేక సిబిఐ నుంచి వస్తుందా అనేది వేచి చూడాల్సిందే.



