బీజేపీ వైఖరి మారిందా లేక సీనియర్ల స్వయంకృతమా?

somu veerraju gvl narasimha rao

బీజేపీ అధిష్టానం ఏపీ బీజేపీలో సీనియర్లకు టికెట్స్ నిరాకరించి బయట పార్టీల నుంచి వచ్చిన వారికి ఇవ్వడాన్ని రెండు కోణాలలో చూడవచ్చు. మొదటిది సీనియారిటీ కంటే పార్టీ ప్రయోజనాలే ముఖ్యమని అధిష్టానం భావిస్తుండటం. రెండోది సీనియర్ల స్వయంకృతాపరాధాలు.

ADVERTISEMENT

కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మొదటి ఫార్ములానే పాటించి విజయం సాధించింది. అందుకోసం పార్టీలోని సీనియర్లను పక్కన పెట్టి, ఇతర పార్టీల నుంచి గెలుపు గుర్రాలను తెచ్చుకొని రేసులో దింపింది. ఆ ఫార్ములా వర్కవుట్ అవడంతో ఇప్పుడు బీజేపీ కూడా తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ నుంచి దిగుమతి చేసుకొన్న గెలుపు గుర్రాలను లోక్‌సభ ఎన్నికల బరిలో దింపుతోంది. ఇప్పుడు అదే ఫార్ములాను ఏపీలో కూడా అమలుచేస్తోందని భావించవచ్చు.

అందుకే కిరణ్ కుమార్‌ రెడ్డి, సుజనా చౌదరి, సిఎం రమేష్, వర ప్రసాద్, కొత్తపల్లి గీత వంటివారికి టికెట్స్ ఇచ్చి, సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి, జీవీఎల్, మాధవ్ వంటి సీనియర్లను పక్కన పెట్టేసిందనుకోవచ్చు.

దీనినే మరో కోణంలో నుంచి చూస్తే, సోము వీర్రాజుని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా నియమించినప్పుడు ఆయన పార్టీ అధిష్టానం ఆలోచనలకు అనుగుణంగానే వైసీపితో అంటకాగారు. మిగిలిన ముగ్గురు నేతలు కూడా కాస్త అటూ ఇటూగా ఇదేవిదంగా వ్యవహరించారు. కానీ ఎన్నికలొచ్చేసరికి బీజేపీ అధిష్టానం సడన్‌గా యూట్యూబ్‌లో టర్న్ తీసుకొని టిడిపితో పొత్తుపెట్టుకోవడంతో వారు దెబ్బైపోయారు.

రాష్ట్రంలో బీజేపీకి జనసేన మిత్రపక్షంగా ఉందని, దాని అధినేత పవన్‌ కళ్యాణ్‌కు ప్రధాని నరేంద్రమోడీ చాలా విలువ ఇస్తారని తెలిసి ఉన్నప్పటికీ సోము వీర్రాజు తదితరులు జనసేనకు దూరంగా వైసీపికి దగ్గరగా ఉన్నారు. దగ్గుబాటి పురందేశ్వరి కూడా ఇంతవరకు పవన్‌ కళ్యాణ్‌తో నేరుగా భేటీ అవలేదు. అలాగని జనసేనను దూరం చేసుకోలేదు. వారిలాగ ఆమె వైసీపికి దగ్గరవలేకపోవడం ఆమెకు ఇప్పుడు కలిసి వచ్చింది. కనుక ఈ విషయంలో ఆమె వారి కంటే చాలా తెలివిగా వ్యవహరించారని చెప్పవచ్చు.

బీజేపీ అధిష్టానం అమరావతికి కట్టుబడి ఉందని సోము వీర్రాజు స్వయంగా చెప్పేవారు. కానీ వారు నలుగురూ గట్టిగా నిలబడి మూడు రాజధానులు అంటున్న జగన్మోహన్‌ రెడ్డిని కట్టడి చేసే ప్రయత్నం చేసినా వారికి రాష్ట్ర ప్రజల మద్దతు లభించి ఉండేది. ప్రజాభిమానం ఉంటే వారికి నేడు ఇంత అవమానం జరిగేదే కాదు కదా?

అన్నిటికీ మించి బీజేపీ హిందుత్వ అజెండాని నలుగురు మరిచిపోయారు. లేకుంటే వైసీపి పాలనలో హిందూ దేవాలయాలలో జరుగుతున్న దొంగతనాలు, నిధుల మళ్ళింపు, అపచారాలు, చివరికి దేవతా మూర్తుల విధ్వంసాలను గట్టిగా ఖండిస్తూ వైసీపి మీద పోరాడి ఉండాలి. కానీ వాటినీ పట్టించుకోకుండా వైసీపితో అంటకాగారు. కనుక ఏవిదంగా చూసినా ఇది వారి స్వయంకృతాపరాధాలే అని అర్దమవుతోంది. కనుక తమకు అధిష్టానం టికెట్స్ ఇవ్వలేదని ఇప్పుడు బాధపడటం, అవమానంగా భావించడం అనవసరమే!

ADVERTISEMENT
Latest Stories