‘ఖడ్గం’ సినిమాలో ‘ఒక్క ఛాన్స్ ప్లీజ్’ అన్న డైలాగ్ గుర్తుంది కదా… ప్రస్తుతం అలాంటి డైలాగ్ నే సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ను వేడుకుంటున్నారు. కొత్త ఏడాది సందర్భంగా ఓ పోస్టర్ నైనా రిలీజ్ చేయొచ్చు కదా అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు.
ఏదొక స్పెషల్ డే రావడం, సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఇలా ప్రొడక్షన్ సంస్థను అడగడం, చాలా సర్వసాధారణం అయిపోయింది. ఎంత అడిగినా చిత్ర నిర్మాణ సంస్థ రిలీజ్ చేయడం లేదని ఫ్యాన్స్ ఆగడం ఆపరు, ఫ్యాన్స్ అడుగుతారు కదా అని మైత్రీ మూవీ మేకర్స్ కనీసం ఓ పోస్టర్ నైనా సిద్ధం చేయడం లేదు.
‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో డైలాగ్ మాదిరి ‘సరిపోయారు… ఇద్దరూ ఇద్దరే’ అన్న రీతిలో మొండి ఘటాలుగా మారిపోయారు. మైత్రీపై మహేష్ ఫ్యాన్స్ కు మరో రగిలిపోయే విషయం ఏమిటంటే, సూపర్ స్టార్ 28వ సినిమాను నిర్మించే సంస్థ కూడా న్యూ ఇయర్ విషెస్ చెప్తూ ఓ చిన్న వీడియో అయినా రిలీజ్ చేసింది గానీ, మైత్రీ మాత్రం మౌనం వహిస్తోంది.
జనవరిలో “సర్కార్ వారి పాట” ప్రమోషన్స్ ఉంటాయని నిన్న కూడా ట్వీట్ చేసింది కానీ ఎప్పుడు, ఏంటి? అన్న విషయం చెప్పలేదు. చిన్న చిన్న సినిమాలు కూడా 2022 శుభాకాంక్షలు తెలుపుతూ ఓ కొత్త పోస్టర్ ను రిలీజ్ చేస్తుండగా, వాటిని తిలకించే క్రమంలో సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు మైత్రీపై ఆక్రోశం ఆకాశాన్ని తాకుతోంది.
ఓ పక్కన మహేష్ ఏమో దుబాయ్ లో కొత్త సంవత్సర వేడుకలు జరుపుకుంటూ సందడి చేస్తున్నాడు. హీరో కూడా పర్సనల్ అప్ డేట్స్ ఇస్తున్నారు గానీ, సినిమాకు సంబంధించిన అంశంపై మాత్రం గమ్మున ఉండిపోయారు. మరో పక్కన ‘సర్కార్ వారి పాట’ ఏప్రిల్ విడుదల కూడా అసంభవంగా కనిపిస్తుండడం కధలోని అసలు ట్విస్ట్.



