టికెట్‌ ఇవ్వకపోయినా జగనన్న వెంటే… రోజక్క చెప్పేసిందిగా!

YSRCP-Roja-Selvamani-Nagiri

పర్యాటకశాఖ మంత్రి అంటే నెలకు రెండుసార్లు తిరుమల శ్రీవారిని, రెండుసార్లు తాడేపల్లిలో జగనన్నని దర్శించుకు రావడమే… సజ్జల సిగ్నల్ ఇవ్వగానే చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌, పవన్‌ కళ్యాణ్‌లను అవహేళన చేస్తూ మాట్లాడటమే అనుకొనే మంత్రి రోజా, మంగళవారం మరోమారు తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకొన్నారు.

అనంతరం అక్కడ విలేఖరులతో మాట్లాడుతూ, “నాకు ఈసారి టికెట్‌ రాదని, నన్ను జగనన్న పక్కన పెట్టేస్తారంటూ టిడిపి దాని అనుకూల మీడియా తెగ ప్రచారం చేస్తూ శునకానందం పొందుతున్నాయి. నాకు మళ్ళీ టికెట్‌ ఇచ్చినా ఇవ్వకపోయినా కడవరకు నేను జగనన్న వెంటే నడుస్తాను. అయితే నాకు టికెట్‌ ఇవ్వరనేది దుష్ప్రచారం మాత్రమే.

ADVERTISEMENT

నేను నగరి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి తరచూ నియోజకవర్గంలో గడప గడపకు వెళ్ళి ప్రజల సమస్యలు అడిగితేలుసుకొంటూ వాటిని పరిష్కరిస్తున్నాను. మా ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పధకాలన్నీ నియోజకవర్గంలో ప్రతీ ఒక్కరికీ అందేలా చేస్తున్నాను. అందువల్ల నియోజకవర్గం ప్రజలకు వాటిని అందిస్తున్న జగనన్నపైనా, నాపైన కూడా చాలా అభిమానం చూపుతున్నారు.

మంత్రివర్గ సమావేశాలకు, పార్టీ కార్యక్రమాలకు టంచనుగా హాజరవుతుంటాను. పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటుంటాను. అందుకే జగనన్న నాకు మంత్రి పదవి ఇచ్చి గౌరవించారు. కనుక నగరిలో మళ్ళీ నాకే తప్పకుండా టికెట్‌ ఇస్తారని భావిస్తున్నాను. టికెట్‌ ఇవ్వకపోయినా నేను జగనన్న వెంటే నడుస్తాను,” అని మంత్రి రోజా అన్నారు.

జగన్‌ పక్కబెట్టబోతున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలలో రోజా కూడా ఒకరని ప్రతిపక్షాలు, వాటి మీడియా కాదు… ఆమె సాటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులే చెపుతున్నారు. నియోజకవర్గంలో ప్రజలను, పార్టీ క్యాడర్‌ని పట్టించుకోకుండా తిరుగుతున్న ఆమెకు మళ్ళీ టికెట్‌ ఎందుకు ఇవ్వాలని కార్యకర్తలే అడుగుతున్నారు.

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో సహా నగరి నియోజకవర్గంలో 5 మండలాలలో వైసీపి ద్వితీయశ్రేణి నేతలు, కార్యకర్తలు మంత్రి రోజాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అందుకే ఈసారి జగన్‌ ఆమెను పక్కనపెట్టబోతున్నారని వైసీపిలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

నేడో రేపో జగన్‌ నగరి నియోజకవర్గానికి వేరొకరిని ఇన్‌చార్జిగా ప్రకటిస్తే, అప్పుడు రోజా “జగనన్న నన్ను ఎందుకు పక్కన పెట్టారో…” అంటూ కన్నీళ్ళు పెట్టుకొని వాపోకుండా “నాకు టికెట్‌ ఇవ్వకపోయినా జగన్‌ వెంటే నడుస్తా…” అంటారో లేదో ఎలాగూ అందరూ చూస్తారు.

ADVERTISEMENT
Latest Stories