తెలుగు సినిమా పుట్టినప్పటి నుంచి ఎందరో గొప్ప నటీనటులు పరిశ్రమ మీద తమదైన ముద్ర వేశారు. అందులో కొందరే యుగపురుషులుగా చరిత్ర సృష్టికర్తలుగా మిగిలిపోయారు. వాళ్లలో స్వర్గీయ నందమూరి తారకరామారావు ఒకరు. కాలం చేసి పాతికేళ్ళు దాటుతున్నా ఇప్పటికీ శ్రీకృష్ణుడు, శ్రీరాముడు అంటే మదిలో మెదిలే రూపం ఆయనదే. మాయాబజార్ లో నీలమేఘశ్యాముడిగా కనికట్టు చేసినా దానవీరశూరకర్ణలో సుయోధన కర్ణ పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసినా ఆయనకే చెల్లింది. ఇలాంటి ఘట్టాలు ఎన్నో.
2023 ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు వేదికగా మారింది. నిజానికి ఈ సందర్భాన్ని వేడుకలా చేయాల్సింది ముందు సినీ పరిశ్రమ ఆ తర్వాత ప్రభుత్వాలు. కానీ అటు విజయవాడలో ఇటు హైదరాబాద్ లో చేస్తోంది ముందుండి నడిపిస్తోంది అభిమానగణమే, నటుల ప్రస్థానాన్ని ఎప్పుడూ రాజకీయాలతో ముడిపెట్టకూడదు. తెలుగుదేశం వ్యవస్థాపకుడిగా ఎన్టీఆర్ ముద్ర పొలిటికల్ గా చూడకూడదు. జీవితం చివరి అంకంలో మేజర్ చంద్రకాంత్ లాంటి బ్లాక్ బస్టర్ లో నటించి తన నటతృష్ణను చివరి వరకు తీర్చుకుంటూనే వచ్చారు.
యుగపురుషుడు మహనీయుడనే ఉపమానాలు బిరుదులూ ఊరికే రాలేదు. అడవిరాముడు ఎన్టీఆర్ కాకుండా ఇంకెవరు చేసినా అది కోట్ల రూపాయల బొమ్మ అయ్యేదే కాదు. దాంతో టాలీవుడ్ కో కొత్త కమర్షియల్ గ్రామర్ నేర్పించారు రాఘవేంద్రరావు. అదే బాటలో ఇప్పటికీ నడుస్తున్న దర్శకులు ఎందరో. లవకుశను రామాయణగాథకు ప్రామాణికంగా తీసుకునే ఫిలిం మేకర్స్ వందల్లో ఉంటారు. చిరంజీవి రజినీకాంత్ లాంటి మెగాస్టార్ సూపర్ స్టార్ లకే ఎన్టీఆర్ ఎంత మార్గదర్శకమో వాళ్లే చెప్పిన ఇంటర్వ్యూ సాక్షాలు ఉన్నాయి.
ఇది ఒక పార్టీ తరఫునో లేదా ఒక అసోసియేషన్ తరఫునా జరగాల్సిన వేడుక కాదు. ఎందుకంటే వంద సంవత్సరాల మైలురాయి ఒకసారే వస్తుంది. మళ్ళీ రెండు వందల వసంతాలు పూర్తయ్యేనాటికి ఇప్పుడున్న వారెవరూ భూమ్మీద ఉండరు. అలాంటప్పుడు అరుదైన ఈ సందర్భాన్ని చిరకాలం గుర్తుండిపోయేలా ఇండస్ట్రీతో పాటు తెలుగు ప్రభుత్వాలు చేయాలి. ఇంకో ఏడు నెలల సమయం ఉంది కాబట్టి ఆలోగా ఏదైనా జరపగలిగితే మంచిదే. రాబోయే రోజుల్లో అక్కినేని శతజయంతి వస్తుంది. ఇలాంటి సంప్రదాయాలు కొనసాగాలి



