‘బుడ్డోడు’ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న తదుపరి చిత్రం “జనతా గ్యారేజ్” సినిమా ఫస్ట్ లుక్ విడుదలైంది. అంచనాలను మించి ఎన్టీఆర్ కనిపించడంతో జూనియర్ ఫ్యాన్స్ లో సందడి వాతావరణం నెలకొంది. ముదురు గడ్డంతో బైక్ పైన ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఫ్రెష్ లుక్ తో పాటు, టైటిల్ లోగో మరియు ‘ఇచ్చట అన్ని రిపేర్లు చేయబడును’ అనే ట్యాగ్ లైన్ అదిరిపోయాయని ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
సోషల్ మీడియాలో విపరీతంగా సందడి చేస్తున్న ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ పై ‘బర్నింగ్ స్టార్’ సంపూర్ణేష్ బాబు తనదైన శైలిలో పంచ్ డైలాగ్ పేల్చాడు. జూనియర్ ఎన్టీఆర్ ‘బృందావనం’ సినిమాలో బాగా పాపులర్ అయిన డైలాగ్ ను అనుకరిస్తూ… “సైడ్ యాంగిల్ లో ఉన్నాడు… సైడ్ అయిపోతాడేమో అనుకున్నారేమో… నేరుగా ఫేస్ చేసే దమ్ము నీకోచ్చినప్పుడు విశ్వరూపమే…” అంటూ ట్వీట్ చేసి జూనియర్ అభిమానులను మరింతగా ఉత్సాహపరిచాడు.
ఈ పోస్టర్ తో పాటు జూనియర్ ఎన్టీఆర్ ఓ బ్యాగ్ తగిలించుకుని షెడ్ లో ఉన్న పోస్టర్ ను కూడా విడుదల చేసారు. జూనియర్ ధరించిన కాస్ట్యూమ్స్ గతంలో మరెన్నడూ వేయకపోవడంతో అభిమానులకు ఈ రెండు పోస్టర్లు కన్నుల పండుగగా ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ విడుదలైన ఈ పోస్టర్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.



