విడుదల సమయం దగ్గరవుతున్న కొద్దీ జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల్లో కొత్త ఉత్సాహంతో పాటు టెన్షన్ వాతావరణం కూడా అలుముకుంటోంది. అయితే వారి టెన్షన్ కాస్త తగ్గించే ప్రయత్నమూ లేక సినిమాపై ఉన్న అంచనాలను తగ్గించే ప్రయత్నమూ గానీ “నాన్నకు ప్రేమతో” స్టోరీ ఇదేనంటూ సోషల్ మీడియాలో ఓ కధ చక్కర్లు కొడుతోంది.
కథలో ఎన్టీఆర్ లండన్ బేస్డ్ ఎన్నారై. అతనికి తండ్రి(రాజేంద్రప్రసాద్) అంటే ప్రాణం. అయితే రాజేంద్రప్రసాద్… తన పార్టనర్ అయిన పెద్ద పారిశ్రామిక వేత్త (జగపతిబాబు) చేతిలో మోసపోతాడు. ఆ బెంగతో చివరి క్షణాల్లో ఉన్న రాజేంద్రప్రసాద్ తన కొడుకుని ఓ కోరిక కోరుతాడు. ఆ కోరిక విన్న హీరో తన తండ్రి నుంచి మోసం చేసి లాక్కున్న ఆస్ది మొత్తాన్ని తన తెలివి తేటలతో విలన్ జగపతిబాబు నుంచి కక్కిస్తాడు. అందుకోసం ఎన్నో మైండ్ గేమ్స్ ఆడతాడు. తన తండ్రి కోసం ఎంతకైనా తెగిస్తాడు. మొదట్లో లైట్ గా తీసుకున్నా తర్వాత జగపతిబాబు… ఎన్టీఆర్ ని దెబ్బకొట్టడానికి ప్రయత్నిస్తాడు. అలా ఎత్తుకు పై ఎత్తులతో సాగుతుంది. చివరికి జగపతి బాబుని రోడ్డుపై నిలబెట్టి, తన తండ్రి నుంచి లాక్కొన్న ఆస్ది మొత్తాన్ని వెనక్కి తీసుకువస్తాడు. 30 రోజుల టైమ్ పీరియడ్ లో జరుగుతుంది ఇది.
ఇలా హల్చల్ చేస్తున్న ఈ సినిమా కధ చదువుతుంటుంటే పాత సినిమాలు చాలా గుర్తుకు రావడం సహజమే. అయితే ఇదే నిజమైన కధ కాదా? అవునా? అన్నది మరికొద్ది గంటల్లో తెలిసిపోతుంది. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో కధ గురించి ప్రస్తావిస్తూ… కధ పాతదే కానీ, కధనం కొత్తగా ఉంటుందని చెప్పడంతో “నాన్నకు ప్రేమతో” సినిమా ఇదేనంటూ బలమైన ప్రచారం జరుగుతోంది. ఒక వేళ అసలు కధ ఇదే అయితే, ఆస్తి రాబట్టడమే హీరో అసలు లక్ష్యమా? అని నెటిజన్లు పెదవి విరుస్తున్నారు.





