కొత్త స్కెచ్ : విగ్రహాల ధ్వంసం?

NTR -statue destroying in APగడిచిన 24 గంటలుగా ఓ వీడియో సోషల్ మీడియాలో తీవ్రంగా హల్చల్ చేస్తోంది. ముఖ్యంగా తెలుగుదేశం కార్యకర్తలు రగిలిపోయే విధంగా ఈ వీడియో ఉండడంతో, తెలుగు తమ్ముళ్లు ఎంతో ఆగ్రహంతో ఈ వీడియోను షేర్ చేసుకుంటూ తమ భావాలను సోషల్ మీడియాలో పెడుతున్నారు.

మాచర్ల నియోజకవర్గం దుర్గిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రముఖ వైసీపీ నేత శెట్టిపల్లి యల్లమంద తనయుడు కోటేశ్వరరావు సుత్తిపెట్టి పగలకొడుతున్న విజువల్స్ పై తెలుగుదేశం అభిమానులు మిక్కిలి ఆగ్రహంతో ఉన్నారు. పబ్లిక్ గా జరిగిన ఈ ఉదంతంపై ప్రస్తుతానికి ఎలాంటి చర్యలు అయితే తీసుకోలేదు.

ADVERTISEMENT

అయితే గత పది రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తే, రాజకీయంగా సరికొత్త ఎత్తుగడలకు నిలయంగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తోందన్న భావన పొలిటికల్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఓ పక్కన వంగవీటి రాధాపై రెక్కీ, కొద్దీ గ్యాప్ లో ఎన్టీఆర్ విగ్రహ ధ్వంసం… ఇవేమి కాకతాళీయంగా జరిగినవి కావు, దీనివెనుక ఖచ్చితంగా ఏదో పొలిటికల్ స్కెచ్ ఉందన్న భావన బలపడుతోంది.

ముఖ్యంగా ఎన్టీఆర్ విగ్రహ ధ్వంసన ద్వారా తెలుగుదేశం కార్యకర్తలను రెచ్చగొట్టే చర్యగా కనపడుతోంది. నాడు పార్టీ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడిలో కూడా ఇదే రకమైన ఉదంతం జరిగినప్పటికీ, పార్టీ అధినేత చంద్రబాబు సంయమనం వహిస్తూ ఇచ్చిన పిలుపుతో రాష్ట్రంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోలేదు. ఓ రకంగా ప్రత్యర్థి పార్టీ వ్యూహాలను అలా తిప్పికొట్టడంలో చంద్రబాబు సఫలమయ్యారు.

తాజాగా జరిగిన చర్యతో సోషల్ మీడియాలో అయితే ఎన్టీఆర్ అభిమానులు గానీ, తెలుగుదేశం కార్యకర్తలు గానీ ఆగ్రహంతో ఊగిపోతున్నారు. వీళ్లంతా రోడ్డుపైకి వచ్చి ప్రత్యర్థి పార్టీకి సంబంధించిన విగ్రహాలను ధ్వంసం చేస్తే, వాటిని తమ మీడియాలలో వేసి ప్రజలలో తెలుగుదేశం పార్టీని దోషిగా నిలబెట్టి, తద్వారా సింపతీని రాబట్టుకుని ప్రజలను తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నంలో భాగంగా ఇదంతా జరుగుతోందా?

ఏమో రాజకీయం ఎలాంటి పనులనైనా చేయిస్తుందని గత సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగిన కొన్ని ఉదంతాలు చెప్పకనే చెప్పాయి. ప్రతిపక్ష పార్టీ నేతపై విమానాశ్రయంలో కోడికత్తి దాడి, అలాగే ప్రతిపక్ష పార్టీ సొంత బాబాయ్ హత్యకు గురి కావడం వంటి అంశాలు రాజకీయంగా ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఆ క్రమంలోనే ఈ విగ్రహ ధ్వంసనలు కూడానా? ఏమో కాలమే సమాధానం చెప్పాలి.

ADVERTISEMENT
Latest Stories