ఈ తరంలో వస్తోన్న సినిమాలు ‘క్లాసిక్స్’గా నిలిచిపోవడం అంటే బహు అరుదనే చెప్పుకోవాలి. కానీ ప్రిన్స్ మహేష్ బాబు కెరీర్ లో “అతడు, శ్రీమంతుడు” వంటి రెండు సినిమాలు క్లాసిక్స్ జాబితాలో ఉన్నాయి. అయితే ‘శ్రీమంతుడు’ క్లైమాక్స్ విషయంలో చాలా మంది అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. సినిమా అంతా అద్భుతంగా నడిపిన కొరటాల, క్లైమాక్స్ కు వచ్చేపాటికి కమర్షియల్ పంథాలో వెళ్ళిపోవడం అభిమానులతో సహా చాలామందికి రుచించలేదు.
[m9ad]
కానీ ఈ సినిమా క్లైమాక్స్ ఇలా అయితే అద్భుతంగా ఉంటుందంటూ ‘పరుచూరి పాఠాలు’లో గోపాలకృష్ణ చెప్పుకొచ్చారు. ఇది విన్న తర్వాత ‘అరెరే… ఇదయితే సూపర్…’ అనుకోవడం ప్రేక్షకుల వంతవుతోంది. ఇంతకీ పరుచూరి గోపాలకృష్ణ గారు ఏం చెప్పారంటే… ఈ సినిమాలో విలన్ గ్యాంగ్ ను మహేష్ బాబు ఫ్యాక్టరీలో తగలబెట్టడమనేది కొంతమంది ఆడియన్స్ కి ఐ జర్క్ లాగా అనిపిస్తుంది. మేనేజర్ కూతురు పెళ్లికి 20 లక్షలు ఇచ్చిన ఉదాత్తమైన మనసున్నవాడు, ఇంతటి హింస చేయగలడా అని అనుకుంటే, ఈ కథకి మరో ముగింపు రాసుకోవచ్చు.
“మూడు వేలమంది వున్నారు… ముప్పై మందిపై తిరగబడలేరా?” అని ఊళ్లో జనాలలో ఉత్తేజం రేపటం ద్వారా, జనాలు ఒక్కసారిగా విలన్ గ్యాంగ్ పై దాడికి దిగుతారు. మరోపక్కన ప్రధానమైన విలన్స్ తో హీరో అయిన మహేష్ పోరాడతాడు. క్షమించమని విలన్స్ కాళ్లు పట్టుకుంటారు. కట్ చేస్తే… ఎప్పటిలానే ఆ ఊరికి బస్సు వస్తుంది. ఆ ఊరి జనం, మహేష్ చూస్తుండగా విలన్ గ్యాంగ్ ఆ బస్సు ఎక్కి వెళ్ళిపోతారు. అప్పుడు మహేశ్ బాబు ‘ఇక ఈ ఊరి నుంచి వెళ్లవలసిన వాళ్లు ఎవరూ లేరు, వెళ్లవలసిన వాళ్లు వెళ్లిపోయారు’ అంటాడు. మళ్లీ అలాంటివాళ్లు ఊళ్లోకి వస్తే ఏం చేయాలనేది ఊళ్లో వాళ్లకి హీరో నేర్పేశాడు కాబట్టి ఇక సమస్య రాదు’ అని చెప్తారంటూ ‘శ్రీమంతుడు’ క్లైమాక్స్ గురించి చెప్పుకొచ్చారు.



