సీజ్ ది షిప్ మరోసారి బాగోదన్నా!

Pawan Kalyan in Kakinada meeting fishermen

ఏపీ డెప్యూటీ సిఎం పవన్‌ కళ్యాణ్‌ నిన్న కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉప్పాడ మత్స్యకారులతో సమావేశమైనప్పుడు మాట్లాడిన ప్రతీమాట అయన మనసులో నుంచి వచ్చినవే. ఆవిధంగా మాట్లాడుతారు కనుకనే రాజకీయ నాయకులలో భిన్నమైన వ్యక్తిగా గుర్తింపు పొందారు. మనసు విప్పి మాట్లాడుతారు కనుకనే ప్రజలు కూడా ఆయనని అభిమానిస్తుంటారు. అయన మాటలని నమ్ముతుంటారు.

ఉప్పాడలోని ఫార్మా కంపెనీల కాలుష్య జలాల వలన మత్స్యకారులు జీవనోపాది కోల్పోతున్నారు. కనుక వారు ఎదుర్కొంటున్న సమస్యని అర్ధం చేసుకొనేందుకు వారితో కలిసి పడవలో సముద్రంలో కాలుష్య జలాలు కలుస్తున్న ప్రాంతానికి వచ్చి చూస్తానని పవన్‌ కళ్యాణ్‌ చెప్పారు. ఇది మత్స్యకారులు ఊహించ లేదు కనుక వారు హర్షం వ్యక్తం చేశారు.

ADVERTISEMENT

అనంతరం పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడుతూ తనకు 100 రోజులు సమయం ఇస్తే ఇటు మత్స్యకారులకు, అటు ఫార్మా కంపెనీలకు, వాటిలో పనిచేస్తున్న కార్మికులకు ఎవరికీ నష్టం కలిగించని విదంగా ఓ సమగ్రమైన ప్రణాళిక సిద్దం చేసి మీ ముందుంచుతానని పవన్‌ కళ్యాణ్‌ చెప్పారు. అందరి ఆమోదంతోనే ఆ ప్రణాళికని అమలుచేసి శాశ్వితంగా ఈ సమస్యని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

పవన్‌ కళ్యాణ్‌ ఇప్పటికే కాలుష్య నివారణ మండలి అధికారులకు స్థానిక ఫార్మా పరిశ్రమలలో కాలుష్యంపై ఆడిట్ చేసి నివేదిక ఇవ్వాలని కోరారు. కనుక ఇప్పు స్వయంగా మత్స్యకారులతో కలిసి సముద్రంలోకి వెళ్ళి చూసి వచ్చి, ఆ నివేదికని పరిశీలించిన తర్వాత నష్ట నివారణ చర్యలు తీసుకోవాలనుకోవడం చాలా చక్కటి నిర్ణయం.

అయితే పవన్‌ కళ్యాణ్‌ పడవెక్కి మళ్ళీ సముద్రంలోకి వెళ్తానని చెప్పినప్పుడు కొన్ని నెలల క్రితం కాకినాడ పోర్టులో ‘సీజ్ ది షిప్’ అంటూ చేసిన హడావుడి కళ్ళ ముందు మెదులుతుంది.

గోదాముల నుంచి రేషన్ బియ్యం మాయం అయిన కేసుని ఎదుర్కొంటున్న మాజీ మంత్రి పేర్ని నాని అవకాశం చిక్కినప్పుడల్లా ‘సీజ్ ది షిప్’ అంటూ అంత హడావుడి చేసి ఏం పీకారు?రేషన్ బియ్యం అక్రమ రవాణా చేసినవారిపై ఏం చర్యలు తీసుకున్నారు?చెప్పాలంటూ నిలదీస్తూనే ఉన్నారు. కానీ కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పడం లేదు!

కనుక పవన్‌ కళ్యాణ్‌ ఇప్పుడు మళ్ళీ బోట్ ఎక్కితే, వేలకోట్లు టర్నోవర్ కలిగి ఉన్న అరబిందో ఫార్మా వంటి కంపెనీలను కాలుష్య జలాలు సముద్రంలోకి విడుదల చేయకుండా అడ్డుకోగలరా?అనే సందేహం కలుగుతుంది. ఎందుకంటే, వాటి నుంచి చాలా కాలంగా కాలుష్యం వెలువడుతోందనే సంగతి కాలుష్య నివారణ మండలికి ఎప్పటి నుంచో తెలుసు. కానీ లంచాలకు ఆశపడో, రాజకీయ ఒత్తిళ్ళ వల్లనో పట్టించుకోలేదు. కనుకనే నేటికీ ఆ కంపెనీలు ధైర్యంగా సముద్ర జలాలను కలుషితం చేస్తున్నాయి.

కనుక పవన్‌ కళ్యాణ్‌ వాటిని కట్టడి చేయలేకపోతే ఇది మరో ‘సీజ్ ది షిప్’ స్టోరీగా మిగిలిపోతుంది. అప్పుడు మరోచోట మరో సమస్య వచ్చినప్పుడు ఈ రెండు స్టోరీలు కలిపి చెప్పుకోవలసి వస్తుంది అంతే!

ADVERTISEMENT
Latest Stories