పేకమేడలా వైసీపి కూలిపోతుంటే…

Pawan-Chandrababu

ఓ రాజకీయ పార్టీ అధికారంలోకి రావడానికి ఎంతో శ్రమించాలి. అనుకూల రాజకీయ వాతావరణం ఏర్పడాలి. అదృష్టం కూడా కలిసిరావాలి. తెలంగాణ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీయే అయినప్పటికీ అధికారంలోకి రావడానికి పదేళ్ళ సమయం పట్టింది.

ఏపీలో వైసీపి అధినేత జగన్మోహన్‌ రెడ్డి కూడా ఓదార్పుయాత్రలు చేసి తండ్రిలేని బిడ్డనే ప్రజల సానుభూతిని, పాదయాత్రలు చేసి తండ్రిని మించిన పాలన అందిస్తారనే నమ్మకాన్ని కలిగించారు. ముందే చెప్పుకొన్నట్లు 2019 ఎన్నికల నాటికి ఆయనకు అనుకూల రాజకీయ వాతావరణం కూడా ఏర్పడింది. చంద్రబాబు నాయుడి వ్యతిరేక శక్తులన్నీ కలిసిరావడంతో జగన్‌ గద్దెనెక్కారు.

ADVERTISEMENT

ఇంత కష్టపడి సాధించుకొన్న అధికారం నిలుపుకోవాలని జగన్‌ అనుకోవడం సహజమే. కానీ అందుకు ఆయన ఎంచుకొన్న మార్గాలన్నీ తప్పని ఒకటొకటిగా రుజువవుతున్నాయి. దీనికి తోడు తెలంగాణలో తిరుగులేని ‘మొనగాడు’ బోర్లా పడటంతో జగన్మోహన్‌ రెడ్డిలో ఆందోళన మొదలైంది.

దీంతో ఎమ్మెల్యేలు, నియోజకవర్గం ఇన్‌చార్జిలను మార్చేసుకొంటూ తాను ఎంతో కష్టపడి నిర్మించిన వైసీపి కంచుకోటని స్వయంగా కూల్చేసుకొంటున్నారు. ఓ పక్క వైసీపి పేకమేడలా కూలిపోతుంటే టిడిపి, జనసేనలు కలిసి కంచుకోట నిర్మించుకోవడం మొదలుపెట్టాయి.

శ్రీకాకుళం జిల్లా పోలిపల్లి వద్ద నిన్న జరిగిన బహిరంగ సభ ఇందుకు తాజా నిదర్శనం. ఈ సభలో రెండు పార్టీల అధినేతలు, నేతలు ఆప్యాయంగా పలకరించుకొని మాట్లాడుకొన్న తీరు, వ్యవహరించిన తీరుతో రెండుపార్టీల నేతలు, కార్యకర్తలలో కూడా కొత్త ఉత్సాహం, పరస్పర నమ్మకం, అభిమానం పెరిగుతాయని వేరే చెప్పక్కరలేదు.

ఈ సభ ద్వారా టిడిపి, జనసేనలు తమ పార్టీల శ్రేణులకే కాకుండా రాష్ట్ర ప్రజలకు కూడా తాము కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయగలము… చేయబోతున్నామనే చక్కటి సందేశాన్ని అందించగలిగారు. ఈ సభ విజయవంతమైంది కనుక త్వరలో ఇటువంటి సభలు మరిన్ని నిర్వహించి టిడిపి, జనసేనలు ప్రజలను మెప్పించే ప్రయత్నం తప్పక చేస్తాయి. అయితే సీట్లు సర్దుబాట్లు చేసుకొని ప్రజల ముందుకు రాగలిగితే వాటిపై ప్రజలకు మరింత నమ్మకం కలుగుతుంది.

ADVERTISEMENT
Latest Stories