ఏపీ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, అసెంబ్లీ, లోక్‌సభ రెండింట్లోనూ జనసేన కూటమి విజయవంతమవుతుందని బీఎస్పీ అధినేత్రి, యూపీ మాజీ ముఖ్యమంత్రి మాయావతి అన్నారు. విశాఖలో బీఎస్పీ అధినేత్రి మాయావతి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంయుక్త మీడియా సమావేశంలో మాట్లాడిన ఆమె రాష్ట్రంలో తమ కూటమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, పవన్ కల్యాణ్ సీఎం కానున్నారని జోస్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆమె ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాకు మద్దతు ప్రకటించారు.
ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ కూడా మాయావతి మీద పొగడ్తలు కురిపించారు. “దళితులను సీఎం చేస్తాననని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఆ వాగ్దానాన్ని ఆయన విస్మరించారు. దళితుడిని సీఎం చేయకపోయినా ప్రధానిని చేసే అవకాశం ఉంది. మాయావతిని ప్రధానిగా చూడాలన్నదే నా కల,” అన్నారు పవన్ కళ్యాణ్. ఈరోజు సాయంత్రం ఇద్దరు సంయుక్తంగా విజయవాడలో ఒక బహిరంగ సభకు హాజరు అవుతారు. రెండో రోజు పర్యటనలో భాగంగా రేపు ఉదయం తిరుపతిలో జరిగే బహిరంగసభలో పాల్గొన్న తర్వాత సాయంత్రం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించే బహిరంసభలో పవన్ కల్యాణ్‌తో కలిసి పాల్గొంటారు మాయావతి.
దళితులు ఇది వరకు కాంగ్రెస్ కు మద్దతుగా ఉండేవారు. ఆ తరువాత వారు వైఎస్సార్ కాంగ్రెస్ కు మారారు. దళితులలో చాపకింద నీరులా వ్యాపిస్తున్న మతమార్పిడి కూడా ఈ వర్గాలలో వైఎస్సార్ కాంగ్రెస్ కు మద్దతు పెంచింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాయావతి ఉమ్మడి ప్రచారం వల్ల ఆ వర్గాల ఓట్లలో చీలిక వస్తే వైఎస్సార్ కాంగ్రెస్ కు ఇబ్బందనే చెప్పుకోవాలి. ఆ వర్గాల ప్రజలను ఆకట్టుకునే క్రమంలో పవన్ కళ్యాణ్ వారికి ఆ పార్టీకి విరివిగా సీట్లు ఇచ్చారు. ఈ పొత్తు ప్రభావం వైఎస్సార్ కాంగ్రెస్ మీద ఎలా ఉంటుందో చూడాలి.



