జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పదేళ్ళు అనేక ఆటుపోట్లను తట్టుకొని చాలా ఓపికగా రాజకీయాలలో నిలబడినందుకు చివరికి చాలా గొప్ప బహుమానమే లభించింది. అంతకు మించి ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో, కేంద్రం వద్ద చాలా గౌరవమే పొందుతున్నారు కూడా.
చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఒక్కరికే ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడమే కాకుండా కీలకమైన పంచాయితీరాజ్, గ్రామీణ నీటి సరఫరా, అటవీ, పర్యావరణం, శాస్త్ర సాంకేతిక శాఖలను కూడా ఇచ్చారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో తన ఫోటోతోపాటు పవన్ కళ్యాణ్ ఫోటో కూడా పెట్టాలని ఆదేశించారు.
పవన్ కళ్యాణ్ గత 5 ఏళ్ళుగా ఎన్నో అవమానాలు భరించారు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ముద్రగడ పద్మనాభం, పోసాని వంటివారు కూడా ఆయనను ఎంతగా అవహేళన చేశారో అందరూ చూశారు.
వాటన్నిటినీ పవన్ కళ్యాణ్ చాలా ఓపికగా భరిస్తూ, నిబ్బరంగా పోరాడి గెలిచారు కనుకనే ఇప్పుడు ఇంత గౌరవ మర్యాదలు పొందుతున్నారని చెప్పవచ్చు. అంటే ఈ గౌరవమర్యాదలు పవన్ కళ్యాణ్ స్వయంగా సంపాదించుకున్నారన్న మాట!
అయితే ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా, కీలక శాఖల మంత్రిగా పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో పనిచేసి సమర్దత నిరూపించుకోవలసి ఉంటుంది.
జగన్ హయాంలో పంచాయితీరాజ్ వ్యవస్థని నిర్వీర్యం చేశారు. బటన్ నొక్కుడు సభలకు బయలుదేరిన ప్రతీసారి చెట్లను నరికించేసి పర్యావరణానికి కూడా చాలా నష్టం కలిగించారు. సంక్షేమ పధకాల పేరుతో ప్రజల చేతిలో డబ్బు పెడితే చాలనుకున్నారు తప్ప గ్రామాలను అభివృధ్ది చేయకుండా విడిచిపెట్టేశారు. ముఖ్యంగా రాష్ట్రంలో మారుమూల గ్రామాలలో ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. ఈ సమస్యలన్నిటినీ మంత్రి పవన్ కళ్యాణ్ పరిష్కరించవలసి ఉంటుంది.
పవన్ కళ్యాణ్ సినీ పరిశ్రమ నుంచి వచ్చారు కనుక ఆయనకు చంద్రబాబు నాయుడు సినిమాటోగ్రఫీ శాఖని ఇస్తారనుకుంటే శాస్త్ర సాంకేతిక శాఖలను ఇచ్చారు. కనుక దానిపై అవగాహన ఏర్పరచుకొని ఆ రంగాన్ని కూడా అభివృద్ధి చేయాల్సి ఉంటుంది.
పవన్ కళ్యాణ్ ఇంతకాలం చేసిన రాజకీయ పోరాటాలన్నీ ఒక ఎత్తు అయితే, ఇకపై వివిద శాఖల మంత్రిగా చేయబోయే పనులు మరో ఎత్తు అని చెప్పవచ్చు.
సినిమాలలో అసాధ్యాలను సాధ్యం చేసి చూపే హీరోగా చూసిన ప్రజలు, ముఖ్యంగా అభిమానులు ఆయనపై చాలా భారీ అంచనాలే పెట్టుకొని ఉంటారు. కనుక పవన్ కళ్యాణ్ మరోసారి తనని తాను నిరూపించుకోవలసి ఉంటుంది. కానీ ఈ అగ్ని పరీక్షలో నెగ్గితే ఇక ఆయనకు తిరుగు ఉండదు.






