గత సార్వత్రిక ఎన్నికలలో బిజెపి – తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం చేసిన ‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్, నంద్యాల ఉప ఎన్నికల సందర్భంలో మాత్రం తటస్థంగా ఉన్నారు. అక్టోబర్ నుండి ప్రత్యక్ష రాజకీయాలలోకి రావాలని భావిస్తున్న పవన్ కళ్యాణ్, అంతకుముందు మరో పార్టీకి సహకారం అందించి విమర్శలను కొనితెచ్చుకోవడం ఎందుకన్న భావనలో ఉన్నట్లుగా రాజకీయ విశ్లేషకులు భావించారు. దీంతో తెలుగుదేశం పార్టీ ఎవరి అండదండలు లేకుండా ఒంటరిగానే బరిలోకి దిగింది.
రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు చేస్తున్న అభివృద్ధి పనులను ప్రస్తావిస్తూ ప్రచారం చేసుకున్నారు తప్ప, ఎక్కడా చంద్రబాబు పేరు తప్ప ఎవరి పేరు వినిపించలేదు. ఫైనల్ గా ఫలితం టిడిపికి అనుకూలంగా రావడం కంటే కూడా, బహుశా టిడిపి వర్గాలు కూడా ఊహించని స్థాయిలో మెజార్టీ రావడంతో పార్టీ నేతల్లో నూతన ఉత్సాహం ఉరకలేస్తోంది. మరో వైపు ప్రిన్స్ అభిమానులు, అక్కినేని అభిమానులు తమ వైపే ఉన్నారని ప్రచారం చేసుకున్నా, వైసీపీకి ప్రయోజనం లేకుండా పోయింది.
ఈ విజయం పూర్తిగా తెలుగుదేశం పార్టీ మరియు చంద్రబాబు స్వార్జితం. గత ఎన్నికలలో పవన్ అండ ఉండడంతో, టిడిపి గెలుపు ప్రస్తావన వచ్చినప్పుడల్లా, తమ అభిమాన హీరో మద్దతు ఉండడం వలనే గెలిచాడని పవన్ అభిమానులు చెప్పుకునేవారు. అయితే ప్రస్తుతం నంద్యాలలో ప్రజలు ఇచ్చిన తీర్పు చంద్రబాబు మూడేళ్ళ పాలనకు నిదర్శనంగా భావిస్తుండడంతో, టిడిపి గెలుపు విషయంలో ప్రత్యేకంగా పవన్ ను ప్రస్తావించడానికి అవకాశాలు లేకుండా పోయాయి. ఈ పరిణామంతో పవన్ ఫ్యాన్స్ డిఫెన్స్ లో పడ్డట్లే!


