ఒడ్డున కూర్చొని చూస్తున్నవారికి నీళ్ళలో ఎవరైనా మునిగిపోతుంటే కాపాడాలని ప్రయత్నిస్తారు. బహుశః జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దుస్థితి చూసి అలాగే భావిస్తున్నట్లున్నారు.
గురువారం చేబ్రోలులో పట్టు నేత కార్మికులతో మాట్లాడుతూ, “నేను మీ అందరి మద్యే పుట్టి పెరిగాను. మీ కష్టాలు తెలుసుకొనే మీ వద్దకు వచ్చాను. నన్ను నమ్మండి. ఒక్కసారి జనసేనను గెలిపించి మాకో రెండు సంవత్సరాలు సమయం ఇవ్వండి. ఆ రెండేళ్ళలో నా పరిపాలన బాగోలేదనిపిస్తే మీరే నన్ను రీ-కాల్ చేయండి. నేనే పదవికి రాజీనామా చేసి దిగిపోతాను.
Also Read – ఇక్కడ బిఆర్ఎస్.. అక్కడ టీడీపీ: కల్వకుంట్ల కవిత
నేను ఈ వైసీపీ నేతల తిట్లు భరించడం చాలా కష్టంగానే ఉంది. కానీ నా రాష్ట్రాన్ని వారి నుంచి కాపాడుకొని బాగుచేసుకోవాలనే తపనతో వారి తిట్లను మౌనంగా భరిస్తున్నాను. 2024,2029 లో వరుసగా రెండుసార్లు జనసేనను గెలిపించి అధికారం ఇస్తే రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి ‘బంగారు ఆంధ్రప్రదేశ్’గా మారుస్తాను.
ఒక్క మాట నేను చెప్పదలచుకొన్నాను. నేను కులరాజకీయాలు చేయాలనుకోవడం లేదు. మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే వైసీపీ ప్రభుత్వంలాగా 80% పదవులన్నీ ఒకే కులానికి కట్టబెట్టకుండా అందరికీ సమానవకాశాలు కల్పిస్తాము. మాకు ఏ పదవీ అధికారం లేకపోయినా గత పదేళ్ళుగా రాష్ట్రంలో నిసహాయులకు యధాశక్తిన సహాయం చేస్తూనే ఉన్నాము. అదే… మా చేతిలో అధికారం ఉంటే ప్రజలకు, రాష్ట్రాభివృద్ధికి మరింత చేయగలమనే ఆలోచనతోనే మాకు ఒక్క అవకాశం ఇవ్వమని విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు.
Also Read – అమెరికా- చైనా టిట్ ఫర్ టాట్ గేమ్స్ ఓకే కానీ..
పవన్ కళ్యాణ్ తన తాజా పర్యటనలో మొదట పొత్తులు ఉంటాయో లేదో ఇప్పుడే చెప్పబోనని, ఈసారి ఎట్టి పరిస్థితులలో అసెంబ్లీలో అడుగుపెట్టేందుకు రకరకాల వ్యూహాలు అమలుచేస్తామని అన్నారు. ముఖ్యమంత్రి పదవి ఇస్తే తీసుకొంటానని అన్నారు. నిన్న చేబ్రోలులో పదేళ్ళు జనసేనకు అధికారం ఇమ్మనమని అడిగారు.
జనసేన బిజెపితో పొత్తులో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఈవిదంగా మాట్లాడటం చూస్తే దానితో తెగతెంపులు చేసుకోబోతున్నానని సూచిస్తున్నారా లేక వచ్చే ఎన్నికలలో జనసేన ఒంటరిగా బరిలో దిగి మరోసారి వీరమరణం పొందాలనుకొంటోందా లేదా టిడిపి తమతో పొత్తులు పెట్టుకోవాలనుకొంటే ముఖ్యమంత్రి పదవి తనకే ఇవ్వాల్సి ఉంటుందని పవన్ కళ్యాణ్ సూచిస్తున్నారా?అనే సందేహాలు కలుగుతున్నాయి.
Also Read – నారాయణ.. శల్యసారధ్యం చేస్తున్నారా?
అయితే పవన్ కళ్యాణ్ చేస్తున్న ఈ వ్యాఖ్యలపై టిడిపి, బిజెపిలు స్పందించకపోవడం గమనిస్తే, బహుశః వైసీపీని అయోమయపరిచేందుకు ఆ మూడు పార్టీల వ్యూహంలో భాగంగానే పవన్ కళ్యాణ్ ఈవిదంగా మాట్లాడుతున్నారేమో?అనే సందేహం కూడా కలుగుతోంది.
అయితే పవన్ కళ్యాణ్ సృష్టిస్తున్న ఈ అయోమయం వలన జనసేన నేతలు, కార్యకర్తలలో కూడా అయోమయం ఏర్పడితే మొదటికే మోసం రావచ్చు. కనుక పవన్ కళ్యాణ్ పొత్తుల విషయంలో స్పష్టమైన ప్రకటన చేయడమే మంచిది.