‘జనసేన’ స్థాపించి రాజకీయాల్లో సంచలనంగా నిలిచిన పవన్ కళ్యాణ్ పైన ఇప్పటివరకు రాజకీయంగా పెద్దగా విమర్శలు వెలువడలేదు. ఏదో రోజా వంటి వారు ఒకటి, రెండు సందర్భాలలో తమ వాక్చాతుర్యాన్ని ప్రదర్శించారు తప్ప, ఇతర విమర్శలు వ్యక్తం కాలేదు. దీనికి ప్రధాన కారణాలు… ఒకటి పవన్ వ్యక్తిగత శైలి ఒకటైతే, పూర్తిగా రాజకీయాల్లోకి దిగకపోవడం మరొకటి. తనకంటూ ప్రత్యేక సిద్ధాంతాలను ఏర్పాటు చేసుకున్న పవన్, తన గమ్యం ప్రస్తుతానికి కాదు, మరో తరం కోసమని ఇప్పటికే స్పష్టం చేసారు.
మరి అలాంటి సిద్ధాంతాల కోసం తన ప్రత్యేకతను చాటుకోవాల్సిన సమయంలో… అది పక్కనపెట్టి వామపక్షాలతో కలిసి ప్రయాణం చేస్తానని చెప్పడం… జనసేన వేసిన అతి పెద్ద రాంగ్ స్టెప్ గా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. సీపీఐ, సీపీఎంలతో కలిసి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని పవన్ చేసిన ప్రకటన ‘జనసేన’ అభిమానులను పూర్తిగా నిరాశలో పడేసింది. తెలిసి తెలియక ‘ప్రజారాజ్యం’ అధినేతగా చిరంజీవి తప్పులు చేస్తే… మరి పవన్ కు ఎవరు సలహాలు ఇస్తున్నారో గానీ వామపక్షాలతో ఎందుకు కలిసారన్న విషయం ప్రశ్నార్ధకంగా మారింది.
బహుశా తన భావజాలం, ఎర్ర జెండాల భావజాలం కాస్త దగ్గరగా ఉండవచ్చు. కానీ దానికి మార్గం ఇది కాదన్న విషయాన్ని పవన్ తెలుసుకోలేకపోవడం రాజకీయ పరిణితికి నిదర్శనంగా నిలుస్తోంది. భవిష్యత్తులో ఏపీ రాజకీయాల్లో ‘కింగ్ మేకర్’ స్థానాన్ని దక్కించుకుంటాడని భావిస్తున్న పవన్ వామపక్షాలపై వస్తున్న ఆరోపణలకు కూడా బదులు ఇవ్వాల్సి ఉంటుంది. ‘బెదిరింపు రాజకీయాల’తో తమ పబ్బం గడుపుకుంటారనే రాజకీయ ఆరోపణలు వామపక్ష పార్టీలపై వ్యక్తమవుతుంటాయి. మరి అలాంటి ఆరోపణలే తనపై కూడా ప్రత్యర్ధులు సంధిస్తే సమాధానం చెప్పుకోగలరా?
ముఖ్యంగా ఒక రాష్ట్రాన్ని పాలించే నేతగా ఎదగాలంటే… వామపక్షాలతో అది సాధ్యం కాదన్న విషయం పవన్ కు తెలియదా? ఎప్పుడూ ప్రభుత్వంలో ఉండని వామపక్ష పార్టీలలో… ప్రస్తుత తరంలో ఎంతమంది నాయకులు పుట్టుకువచ్చారు? గతాన్ని చూసి వర్తమానంలో తప్పటడుగు వేస్తే… అది భవిష్యత్తుకు ప్రమాదకారి అని పవన్ కు ఎవరూ చెప్పలేదా? తాజా పరిణామాలతో ‘జనసేన’ గమ్యం ఎటువైపుకు వెళ్తుందో అన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది.



