పవన్…క్యాడర్ ని నొప్పించకుండా ఓటర్లను మెప్పిస్తారా.?

Pawan Kalyan ahead of AP local polls

ఏపీలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో అటు ప్రతిపక్ష వైసీపీ శ్రేణులలో కనిపించే ఆందోళన ఇటు అధికార జనసేన శ్రేణులలో సైతం దర్శనమిస్తుంది. అయితే వైసీపీ నేతలలో ఏకగ్రీవాల బెడద తప్పితే చాలు మహాప్రభో అనే ఆందోళన కనిపిస్తుంటే, జనసేన శ్రేణులలో మాత్రం ఎక్కువ సీట్లు సాధించగలిగితే చాలు అనే ఆత్రుత కొట్టొచ్చినట్టు దర్శనమిస్తుంది.

ADVERTISEMENT

జనసేన పార్టీలోని కొందరు నాయకులు తమ బహిరంగ ప్రకటనలతో పార్టీ క్యాడర్ ని పరోక్షంగా రెచ్చకొడుతున్నారు, కొట్టారు కూడా. దాని తాలూకా ఫలితం మాత్రం పార్టీ అధిష్టానం కి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతుంది. కూటమి పొత్తులో భాగంగా మూడు పార్టీల మధ్య సీట్ల సర్దుబాట్లు అనేవి పార్టీల అధినేతల నిర్ణయాల మేరకు సాగుతుంది.

కానీ ఇక్కడ జనసేన లో పార్టీ ఎన్ని స్థానాలలో పోటీ చెయ్యాలి, ఎక్కడెక్కడ బరిలో దిగాలి వంటి కీలక నిర్ణయాలను పార్టీ అధినేత పవన్ కన్నా ముందే కొందరు నేతలు ప్రకటించడం, దానికి సైడర్ నుంచి మద్దతు దక్కడంతో క్షేత్ర స్థాయిలో వివాదాలు ఏర్పడుతున్నాయి.

పార్టీ క్యాడర్ కూడా ఇక చేసిన త్యాగాలు చాలు, పార్టీ బలోపేతం మీద ద్రుష్టి పెట్టాలని, పార్టీని మరింత క్షేత్ర స్థాయిలో బలపరిచేందుకు జనసేన రాజకీయ బలం పెంచడం అత్యంత కీలకం అంటూ సీట్ల సంఖ్య పై తగ్గేదెలా అంటూ పట్టుబడుతున్నారు.

దీనితో పవన్ కు క్యాడర్ ని నొప్పించకుండా కూటమి పొత్తుకి ఒప్పించడం కత్తిమీద సాములా మారింది. ఒకపక్క సీట్ల సంఖ్య తగ్గితే జనసేన, ఎప్పటికి టీడీపీ తోక పార్టీగా నే మిగిలిపోతుంది అనే ఆందోళన పార్టీ క్యాడర్ నుంచి బలంగా వినిపిస్తుంది. అయితే క్యాడర్ ఆవేశాన్ని, ఆతృతను పరిగణలోకి తీసుకుని పార్టీ సీట్ల సంఖ్యను పెంచితే అందుకు తగ్గ బలమైన నాయకులు జనసేనకు ఉన్నారా.? అనే ఆలోచన మరోపక్క జనసేనను వెంటాడుతున్నాయి.

మూడు పార్టీల క్యాడర్ ని సమన్వయం చేసుకుని వైసీపీ పై గెలుపు జెండా ఎగరేసేంత క్షేత్ర స్థాయి రాజకీయ బలం జనసేనకు ఉందా.? అనేది పార్టీ అధినాయకత్వం ముందున్న పెద్ద సవాల్. 2024 సార్వత్రిక ఎన్నికలలో జనసేన 100% స్ట్రైక్ రేట్ తో దూసుకుపోయింది. అటువంటి రికార్డు సొంతం చేసుకున్న జనసేనకు ఇప్పుడు స్థానిక ఎన్నికల విన్నింగ్ పర్శంటేజ్ కూడా అత్యంత కీలకం కానుంది.

జనసేన ఫలితాలు అటుఇటుగా మారితే అది జనసేన ను మానసికంగా కుంగతీసే ప్రమాదం లేకపోలేదు. అటు ప్రత్యర్థి వైసీపీ తో పాటుగా ఇటు మిత్ర పక్షమైన టీడీపీ శ్రేణులు కూడా జనసేన వైపు వేలెత్తి చూపిస్తారు, గొంతెత్తి విమర్శిస్తారు. ప్రజలలో పవన్ చరిష్మా తగ్గింది, జనసేన బలహీనం అయ్యింది అంటూ వైసీపీ స్వరం పెంచే అవకాశం ఉంది. కాబట్టి పవన్ సొంత పార్టీ క్యాడర్ ని నొప్పించకుండా ఓటర్లను మెప్పించుకోవాలి..!

ADVERTISEMENT
Latest Stories