జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బుదవారం సాయంత్రం కాకినాడ జిల్లా, కత్తిపూడి వద్ద బహిరంగసభలో చేసిన ప్రసంగంలో కొన్ని ఆసక్తికరమైన విషయాలున్నాయి. రాష్ట్రాన్ని కాపాడుకొనే బాధ్యత ఉభయగోదావరి జిల్లాలదే అని అన్నారు. ఈసారి ఎన్నికలలో ఇక్కడి నుంచే జనసేన విజయ ప్రస్థానం, వైసీపీ పతనం ప్రారంభం అవుతుందని అన్నారు.
తాను ఒంటరిగా వస్తానో లేదా వేరే పార్టీలతో పొత్తులు పెట్టుకొని వస్తానో వైసీపీ నేతలకెందుకు?అని ప్రశ్నించారు. ఈసారి ఎట్టి పరిస్థితులలో అసెంబ్లీలో అడుగుపెడతానని, దాని కోసం ఎన్ని వ్యూహాలైనా అమలుచేస్తామని చెప్పారు. ఈసారి జనసేన అసెంబ్లీలో అడుగుపెట్టకుండా ఎవరూ అడ్డుకోలేరని అన్నారు. ముఖ్యమంత్రి పదవి ఇస్తే సవినయంగా స్వీకరిస్తానని పవన్ కళ్యాణ్ అన్నారు.
నేను నిజాయితీగా ఉంటాను కనుక నన్ను పాలించేవాడు కూడా నాకంటే ఎక్కువ నిజయాతీగా ఉండాలని కోరుకొంటున్నాను. ఇది తప్పా?” అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.
పవన్ కళ్యాణ్‌కు ఉభయగోదావరి జిల్లాలలో భారీగా అభిమానులున్నారు. కనుక జనసేనకు అక్కడ మంచిపట్టుంది. కనుక అక్కడి నుంచే జనసేన గెలుపు, వైసీపీ ఓటమి మొదలవుతుందని చెప్పడం సహజమే. అయితే పవన్ కళ్యాణ్ మాటల్లో అంతకు మించి చాలా విషయం ఉంది.
మూడు రాజధానుల ప్రతిపాదనతో ముందుగా నష్టపోయినవారు రాజధానికి భూములిచ్చిన రైతులే. అయితే జగన్ ప్రభుత్వం అమరావతిని పాడుబెట్టడం వలన కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఉభయగోదావరి జిల్లాలు తీవ్రంగా నష్టపోయాయి. పాడి పంటలకు, ఆక్వా రంగానికి నిలయమైన ఉభయగోదావరి జిల్లాలు వైసీపీ రాజకీయాలతో అతలాకుతలం అవుతుండటం అందరూ చూస్తూనే ఉన్నారు.
కనుక వైసీపీని అక్కడ ఓడించగలిగితే మళ్ళీ అధికారంలోకి రాకుండా అడ్డుకోవచ్చని పవన్ చెపుతున్నారు. ఉభయగోదావరి జిల్లాల నుంచే మార్పు మొదలవ్వాలని, ఆ మార్పుతోనే రాష్ట్రంలో కూడా మార్పు వస్తుంది కనుక ఈసారి రాష్ట్రాన్ని కాపాడుకోవలసిన బాధ్యత ఉభయగోదావరి జిల్లాల ప్రజలపై ఉందని పవన్ కళ్యాణ్ చెప్పారనుకోవచ్చు.
పొత్తులు ఉంటాయని పవన్ కళ్యాణ్ మరోసారి పవన్ కళ్యాణ్ చెప్పారు కానీ ఏ పార్టీతో అనేది చెప్పలేదు. అయితే ముఖ్యమంత్రి పదవి ఇస్తే తీసుకొంటానని చెప్పడం చూస్తే, బిజెపితో పొత్తులు కొనసాగిస్తూ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ఉండవచ్చనిపిస్తోంది. ఎందుకంటే టిడిపితో పొత్తులు పెట్టుకొని పవన్ అసెంబ్లీలో అడుగుపెట్టగలరు కానీ ముఖ్యమంత్రి ఆశించలేరు కనుక!



