PawanKalyan_Kapu_Leaderమంగళవారం మచిలీపట్నంలో జనసేన పార్టీ ఆవిర్భావదినోత్సవ సభ జరుగబోతున్నందున ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ నాలుగు రోజులు సినిమా షూటింగ్‌లకు బ్రేక్ ఇచ్చి మంగళగిరిలో పార్టీ నేతలు, కాపు, బీసీ కులాల నేతలతో వరుసగా సమావేశమవుతున్నారు. ఈ సందర్భంగా ఆయన వారిని ఉద్దేశ్యించి మాట్లాడుతూ,”నన్ను ఓ సినిమా హీరోగా చాలా మంది అభిమానిస్తారు. నాకు కాపు, రెడ్డితో సహా అన్ని సామాజికవర్గాలలో అభిమానులున్నారు. కనుక నేను ఎప్పుడు సభ నిర్వహించినా అందరూ తప్పకుండా వస్తారు. చప్పట్లు కొడతారు. కానీ ఎన్నికలలో నాకు ఓట్లేయరు.

ఏమని అడిగితే ఓ సినిమా హీరోగా నన్ను అభిమానిస్తారట కానీ ఎన్నికలలో కులాలు చూసుకొని ఓట్లేసుకొంటామని నా మొహం మీదనే చెప్పారు. మరొకరైతే వెంటనే రాజకీయాలకు స్వస్తి చెప్పేసి వెళ్ళిపోయేవారు. కానీ నేను ఇన్ని అవమానాలు ఎదురవుతున్నా రాజకీయాలలోనే ఎందుకు ఉన్నానంటే ఈ రాజకీయాలలో మార్పు తెచ్చి, రాష్ట్రాన్ని గాడినపెట్టుకోవాలనే ఆశతోనే. నా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఏదో చేయాలనే తపనే నన్ను రాజకీయాలలో కొనసాగేలా చేస్తోంది.

Also Read – చంద్రబాబు నాయుడుతో పోటీకి రేవంత్‌ రెడీ!

నేను ఔనాన్నా కాదన్నా అందరూ నన్ను ఓ రాజకీయ పార్టీ నాయకుడిగా కంటే ఓ కాపు నాయకుడిగానే గుర్తిస్తున్నారిప్పుడు. కానీ కాపులు మాత్రం నన్ను తమ నాయకుడిగా గుర్తించడం లేదు!

సంఘటితంగా ఉండాల్సిన మనం వేరే పార్టీల ఉచ్చులో ఎందుకు చిక్కుకొంటున్నాము?కాపుల రాజ్యాధికారం కోసం నేను పోరాడుతుంటే, మీరందరూ నాకు అండగా నిలబడకపోతే ఎలా?జనసేన గెలిస్తే కాపులు గెలిచిన్నట్లు కాదా? ఒక్క కాపులే కాదు… బీసీలు, దళితులు అందరూ కలిసివస్తేనే రాజ్యాధికారం వస్తుంది. కాపులు పెద్దన్న పాత్ర పోషించాల్సిన సమయం వచ్చింది. కాపులు లేకుండా దక్షిణ భారతదేశంలో రాజకీయాలు ఉండవు,” అని జనసేనని అన్నారు.

Also Read – వైసీపీ కి అన్నిటిలోను తొందరేనా.?

గత రెండు ఎన్నికలలో పవన్‌ కళ్యాణ్‌ తనను తాను కాపు నాయకుడుగా చెప్పుకొనే ప్రయత్నం చేయలేదు. కానీ ఈసారి ఇంత నిర్మొహమాటంగా చెప్పుకొంటున్నారు. మాంసం తింటే మెడలో ఎముకలు వేసుకొని తిరగక్కరలేదన్నట్లు రాజకీయాలలో ఉన్నవారు తమ కులాన్ని గురించి ఈవిదంగా చాటింపు వేసుకోనక్కరలేదు.

ఔనాన్నా కాదన్నా అందరూ తనని కాపు నేతగా గుర్తిస్తున్నారని పవన్‌ కళ్యాణ్‌కి కూడా అర్దమైనప్పుడు మళ్ళీ నేను కాపు నేతనని బొట్టు పెట్టి చెప్పడం వలన లాభం కంటే నష్టమే కలుగుతుంది. తనకు అన్ని కులాలలో అభిమానులు ఉన్నారని పవన్‌ కళ్యాణ్‌ చెప్పుకొంటున్నప్పుడు ‘నేనొక కాపు నేతను’ అని నొక్కి చెపితే మిగిలినవారు దూరమవుతారు కదా?

Also Read – వైసీపి ఓటమికి సమీక్షా సమావేశాలు… అవసరమా?

ఇక కాపులకు రాజ్యాధికారం కోసమని చెప్పడం కూడా తొందరపాటే అని చెప్పొచ్చు. అందరూ తనతో కలిసిరావాలని కోరుకొంటున్నప్పుడు అందరికీ రాజ్యాధికారం అని చెప్పాలి కానీ కాపులకు రాజ్యాధికారం అని చెపితే తప్పుడు సంకేతాలు పంపుతున్నట్లే కదా?ఇక టిడిపితో కలిసి జనసేన పనిచేయాలనుకొంటున్నప్పుడు టిడిపిని, దాని ఓటు బ్యాంకుని కూడా పరిగణనలోకి తీసుకొని పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడాల్సి ఉంటుంది.

ఏపీ రాజకీయాలలో కులాల ప్రభావం చాలా ఎక్కువ కనుక పవన్‌ కళ్యాణ్‌ చాలా ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. నోరుజారితే దానికి వక్రభాష్యాలు చెప్పి కాపులతో సహా మిగిలినవారిని కూడా దూరం చేయడానికి వైసీపీ కాసుకొని కూర్చొని ఉందనే విషయం కూడా పవన్‌ కళ్యాణ్‌ మరిచిపోకూడదు.

JanaSena