వీరమల్లుని ప్రేక్షకులు, ప్రజలని పవన్‌ చూసుకోవాలి!

pawan-kalyan-hari-hara-veera-mallu-movie

అనేక వాయిదాలు, నిట్టూర్పులు, విమర్శల తర్వాత పవన్‌ కళ్యాణ్‌ నటించిన హరిహర వీరమల్లు నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యింది. సినిమా అద్భుతంగా ఉందని అభిమానులు పండగ చేసుకుంటున్నారు. కానీ కొందరు సినీ విమర్శకులు, కొన్ని వెబ్ సైట్స్ పెదవి విరుస్తున్నాయి. ఈ రెండు ప్రతిక్రియలు కూడా సహజమే.

కానీ వ్యక్తిగత లేదా వృత్తిపరమైన లేదా రాజకీయ కారణాల వల్లనో సినిమా ఫ్లాప్ అవ్వాలని కోరుకునేవారే ఎక్కువ ఉంటారు. కన్నప్ప విషయంలో అదే జరిగింది. కానీ మంచు విష్ణు టీం ‘లీగల్ యాక్షన్’ అంటూ గట్టిగా వార్నింగ్ ఇవ్వడంతో మీడియా, సోషల్ మీడియాలో ఎక్కడా కన్నప్ప గురించి నెగెటివ్‌గా వినపడలేదు. కన్నప్ప సూపర్ హిట్ అయ్యిందా లేదా? పెట్టిన పెట్టుబడికి తగిన రిటర్న్స్ వచ్చాయా లేదా?అనే విషయం మంచు విష్ణుకే తెలుసు.

ADVERTISEMENT

హరిహర వీరమల్లుకి సినిమాలోనే కాక బయట నిజ జీవితంలో కూడా చాలా మంది రాజకీయ శత్రువులున్నారు. కనుక వారందరూ నెగెటివ్‌గానే వ్రాశారు.

కానీ పిల్లి శాపాలకు ఉట్లు తెగిపడవు వైసీపీ శాపనార్ధాలు పెట్టినంత మాత్రాన్న హరిహర వీరమల్లు ఫ్లాప్ అయిపోదు. ఏ సినిమా అయినా ప్రేక్షకులకు నచ్చితేనే థియేటర్లలో నిలబడుతుంది లేకుంటే లేదు…. అని ఇప్పటికే అనేకసార్లు నిరూపితమైంది. కనుక హరిహర వీరమల్లుని ప్రేక్షకులకే వదిలేద్దాం.

నేడు పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడుతున్న ‘సనాతన ధర్మ పరిరక్షణ’ గురించి నాలుగేళ్ళ క్రితం మొదలుపెట్టిన ఈ సినిమాలో చూపడం గమనిస్తే అందరూ అనుకొంటుతున్నట్లు పవన్‌ కళ్యాణ్‌ బీజేపి కోసమో లేదా తమిళనాడులో రాజకీయాల కోసమో ‘సనాతన ధర్మ పరిరక్షణ’ గురించి మాట్లాడటం లేదని, అయన నమ్మి ఆచరించాలనుకుంటున్నదే మాట్లాడుతున్నారని అర్ధమవుతుంది.

ఓ నటుడుగా అన్ని జోనర్లలో అన్ని రకాల పాత్రలు చేయాల్సి ఉంటుంది. కనుక పవన్‌ కళ్యాణ్‌ ఈ సినిమా చేసినప్పటికీ అభిమానులు ఆయన నుంచి ఇటువంటి చారిత్రిక సినిమా కాదు. అలాగే ప్రజలు ఆయన నుంచి ఆశిస్తున్నది సనాతన ధర్మ పరిరక్షణ కాదని చెప్పక తప్పదు.

ఈవిషయం పవన్‌ కళ్యాణ్‌కి తెలియదనుకోలేము. కనుక ఒకవేళ ఇంకా సినిమాలు చేసే అవకాశం ఉంటే అభిమానులు కోరుకున్నటువంటి సినిమాలు చేస్తే ‘మిశ్రమ స్పందన’ల గురించి పట్టించుకోనవసరం ఉండదు.

అలాగే ప్రజలు, ముఖ్యంగా కాపు సామాజికవర్గం ఆకాంక్షలు గుర్తుంచుకొని అందుకు తగినవిదంగా రాజకీయాలలో ముందుకు సాగితే మంచిది.

కాదని ఈ పుణ్యకాలంలో ‘సనాతన హిందీ ప్రయోగాలు’ చేస్తూ సమయం వృదా చేసుకుంటే లేదా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోతే ఆయనతో పాటు జనసేన పార్టీ కూడా నష్టపోయే ప్రమాదం ఉంటుంది. ప్రజలు ఒక్క ఛాన్స్ ఇస్తే సద్వినియోగం చేసుకోలేకపోయిన జగన్‌ ఇప్పుడు ఎన్ని తిప్పలు పడుతున్నారో ఎంతగా అక్రోశిస్తున్నారో కూటమి నేతలు చూస్తూనే ఉన్నారు. కనుక ఈ ‘ఛాన్స్ విలువ’ తెలుసుకొని ప్రతీ ఒక్కరూ తమ సమర్ధత నిరూపించుకుంటే మంచిది.

ADVERTISEMENT
Latest Stories