ప్రతీ రాజకీయ పార్టీ కొన్ని సిద్ధాంతాలు, విధానాలతో పనిచేస్తుంటుంది. కానీ కాలంతో పాటు వాటిలో కూడా కొన్ని మార్పులు, చేర్పులు తప్పదు. లేకుంటే మనుగడ సాగించడం కష్టమవుతుంది.
ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ నిన్న విశాఖలో జనసేన నేతలతో సమావేశమైనప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
“తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. తెలంగాణ సాధనతో ఆ లక్ష్యం నెరవేరింది కనుక ఇక ఆ భావజాలానికి ఇక విలువ ఉండదు. అందుకే ఆయన తన పార్టీ పేరుని బీఆర్ఎస్ పార్టీగా మార్చుకున్నారు. జాతీయ స్థాయి రాజకీయాలు చేయాలనే లక్ష్యం పెట్టుకున్నారు. కనుక ఏ రాజకీయ పార్టీకైనా కాలంతో పాటు మార్పు అనివార్యం,” అని పవన్ కళ్యాణ్ అన్నారు.
బీఆర్ఎస్ పార్టీ విషయంలో పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు అక్షరాల నిజమే. కానీ గమ్మతైన విషయం ఏమిటంటే, ఆ పార్టీ లక్ష్యం నెరవేర్చుకొని కొత్త లక్ష్యం అంటే జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని పార్టీ పేరు మార్చుకున్న తర్వాత మళ్ళీ ప్రాంతీయవాదాన్ని ఆశ్రయిస్తోంది.
‘తెలంగాణ సెంటిమెంట్’ సజీవంగా ఉంచడం ద్వారానే రాజకీయంగా మనుగడ సాగించగలమని గట్టిగా నమ్ముతోంది. ఒకానొక సమయంలో పార్టీ పేరుని మళ్ళీ టిఆర్ఎస్ పార్టీగా మార్చుకోవాలని కూడా అనుకున్నారు. కానీ ఎప్పటికైనా పార్టీ పరిస్థితి మారకపోతుందా పూర్వ వైభవం రాకపోతుందా? అప్పుడు జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పకపోతామా?అనే చిన్న ఆశ పార్టీ పేరుని మార్చకుండా ఆపిందని భావించవచ్చు.
దాని కోసమే తెలంగాణ సెంటిమెంట్ సజీవంగా ఉంచడం చాలా అవసరం కనుక పేరుకి జాతీయపార్టీగా కనిపిస్తునప్పటికీ పక్కా ప్రాంతీయ పార్టీలాగే వ్యవహరిస్తోంది. పవన్ కళ్యాణ్ ఇదే కాస్త మృదువుగా చెప్పరనుకోవచ్చు.




