ఉపముఖ్యమంత్రి గా పదవి బాధ్యతలు తీసుకుని మొదటిసారిగా పిఠాపురంలో ఏర్పాటు చేసిన వారాహి యాత్రలో పాల్గొన్న పవన్ ముఖ్యమంత్రి చంద్రబాబు ను ఉద్దేశించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన 15 రోజులలోపే నెల మొదటి రోజు వాలంటీర్ వ్యవస్థ సాయం లేకుండా ఇచ్చిన హామీ ప్రకారం పెంచిన మొత్తం పెన్షన్ ను ఒక్క రోజులోనే లబ్దిదారులకు అందిచగలిగింది బాబు గారి అనుభవమే అంటూ టీడీపీ మద్దతుదారుల ఓట్లే కాదు మనసులు కూడా గెలిచారు జనసేన అధినేత పవన్.
చంద్రబాబు గారి అనుభవం ఈ రాష్ట్రానికి ఎంత అవసరమో నేడు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో అర్దమయ్యిందని, ఆయన దాష్టికత, ముందు చూపు రాష్ట్రానికి పరిశ్రమలను తీసుకురాగలుగుతుందని బాబు విజనరీని మరోసారి ప్రజలముందు ఆవిష్కరించారు పవన్. తానూ మూడు పార్టీలను కూటమిగా తయారు చేసి విజయం వైపు నడపగలిగాను కానీ పాలన మీద పూర్తి అవగాహన లేదని, ఇప్పుడిప్పుడే శాఖల మీద క్షుణ్ణంగా అవగాహన చేసుకుంటున్నానని నిస్సంకోచంగా సభ సాక్షిగా పవన్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి అయిపోవాలని, ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాలలో ముఖ్యమంత్రి పదవొక్కటే అంతిమ లక్ష్యం కాకూడదనే భావన వ్యక్తం చేసారు పవన్. తండ్రి వారసత్వం ఉంది కదా అని కేటీఆర్ కానీ లోకేష్ కానీ రాజకీయాలలోకి రాగానేనో, పదేళ్ల అనుభవం వచ్చింది కదా ఇక నేను ముఖ్యమంత్రి పదవికి అర్హుడిననే భావనలోకి గాని రాలేదు.
తమకిచ్చిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి అటు పార్టీ మీద ఇటు పాలన విధానాల మీద సమగ్ర అనుభవం సాధించిన తరువాత ముఖ్యమంత్రి పదవికి అర్దహ సాధించాలి. ఇప్పుడు లోకేష్, కేటీఆర్ చేస్తోంది ఇదే. పవన్ కూడా తనకు రాజకీయ వారసత్వం లేకపోయినా ప్రజల అభిమానం మెండుగా ఉన్నా కేవలం తనకు పాలన మీద అనుభవం లేదు అన్న ఒకేఒక్క కారణంగా తనను తానూ తగ్గించుకుని తన అభిమానులకు సద్ది చెప్పారు.
సినిమాలలో ఉన్న క్రేజ్ రాజకీయాలలో సరిపడదని, ఆ క్రేజ్ తో పాలన చెయ్యడం సాధ్యం కాదని తానూ ఇప్పుడే ముఖ్యమంత్రి పదవికి అర్హుడిని కాదని, ముందు సరైన పద్డతిలో పాలన పరమైన అన్నింటి పై అవగాహన సాధించి ఆ తరువాత ముఖ్యమంత్రి పదవిని అందుకోవాలని తన పార్టీ శ్రేణులకు, తన అభిమానులను అర్ధమయ్యే విధానంలో వివరించి ప్రజల నమ్మకాన్ని పొందారు పవన్.
నిజంగా పవన్ చేసిన పని హర్షించదగ్గ పరిణామం. కేవలం తన తండ్రి వైస్సార్ ముఖ్యమంత్రి అనే ఒకేఒక్క అర్హతతో తానూ ముఖ్యమంత్రికి అర్హుడినే అనే మొండి వాదనతో రాజకీయం మొదలుపెట్టిన జగన్ పాలన విధానాల మీద కానీ, శాఖల మీద కానీ ఎటువంటి అవహగానా లేకుండా ముఖ్యమంత్రి పదవిని అందుకున్నారు.
దాని ఫలితం పాలన ఎలా చేయాలో చేతకాక కనీసం ఎటువంటి సలహాదారులను పెట్టుకోవాలో తెలుసుకోలేక తానూ ముఖ్యమంత్రిగా ఉంటూ సుమారు 100 మంది సలహాదారులను నియమించి ఆ సలహాదారుల సలహాల మీద పాలన కొనసాగించారు జగన్. తనకు అవగాహన లేకపోవడం వల్లనో, లేక సరైన సలహాదారులను నియమించుకోక పోవడం వల్లనో రాష్ట్రంలో ఈ ఐదేళ్లు విధ్వంసమే తప్ప అభివృద్ధి జరగలేదు.
దాని ఫలితం ఎలా ఉంటుందో ఇప్పుడున్న ఏపీ పరిస్థితులను చూస్తే అర్ధమవుతుంది. అప్పులు చేసి సంక్షేమం అమలు చేయడం, ప్రభుత్వ ఆస్తులు తాకట్లు పెట్టి బటన్లు నొక్కడం, ప్రభుత్వ భూములను కబ్జా చేసి పార్టీ కార్యాలయాలు నిర్మించుకోవడం, ఉన్న రాజధానిని సమాధి చేసి కొత్త రాజధానికి పునాదులు వెయ్యడం, పరిశ్రమలను తరిమేసి, వ్యవస్థలను చిన్నాభిన్నం చేసి రాష్ట్రాన్ని మరో పదేళ్లు వెనక్కి నెట్టిన జగన్ పాలన అనుభవానికి ఉన్న ప్రాధాన్యతను నిరూపించింది.
దీనితో రాజకీయాలలో వారసత్వం కన్నా, అనుభవానికే అగ్రతాంబూలం అనేది స్పష్టమయింది. అందుకే పవన్ దేనికైనా కొన్నాళ్ల కఠోర శ్రమ అవసరమని భావిస్తారు. పదేళ్ల కష్టానికి ఇప్పుడు ఫలితం దక్కింది. ఈ ఐదేళ్ల కష్టానికి రేపటి రోజున అనుకున్న పదవులు వడ్డించిన విస్తరి మాదిరి తన చేతికి చేరే అవకాశం ఖచ్ఛితంగా వస్తుంది. అప్పటి వరకు ఓపికగా తన పని తానూ చేసుకుంటూ పోవడమే తనముందున్న లక్ష్యం.






