మొన్నటివరకు అభిమానులు చూసిన పవన్ కళ్యాణ్ వేరు… ప్రస్తుత కాలంలో ఫ్యాన్స్ చూస్తున్న పవన్ వేరు..! అవును… పవర్ స్టార్ వైఖరిలో చాలా మార్పు వచ్చింది. ఎంతగా మార్పు అంటే… ఒకప్పుడు అభిమానులు తన సినిమా షూటింగ్ సెట్స్ కు వస్తే… మీ సమయం వృధా చేసుకోవద్దని నిర్మొహమాటంగా వెళ్ళిపోమని చెప్పే పవన్, ప్రస్తుతం అభిమానులతో కలిసి షూటింగ్ స్పాట్స్ లో ఫోటోలు దిగేవరకు మారిపోయారు. అంతేకాదు, సోషల్ మీడియా అంటే ఒక రకమైన ఏహ్యభావన ప్రదర్శించే పవన్, ఇటీవల సోషల్ మీడియాలో కూడా చేరారన్న విషయం తెలిసిందే.
అలాగే నవతరం ప్రపంచాన్ని ఊపేసే సెల్ఫీలన్నా, ఇతర విషయాలన్నా పవన్ కు చాలా విరక్తి. అలాంటి పవర్ స్టార్, ప్రస్తుత ట్రెండ్ ను ఫాలో అవుతుండడం, ఆయనలో వచ్చిన మార్పుకు నిదర్శనంగా సినీ జనాలు చెప్పుకుంటున్నారు. ఇటీవల కాలంలో పవన్ సెల్ఫీలు దిగుతూ ఫోటోలకు ఫోజు ఇవ్వడం ఎక్కువవుతోంది. తొలిసారిగా తన సోదరుడు మెగాస్టార్ చిరంజీవితో సెల్ఫీ దిగిన పవన్, ఆ తర్వాత పలువురు సినీ ప్రముఖులతో, యాంకర్లతో, అలాగే అభిమానులతో కూడా కొన్ని సందర్భాలలో సెల్ఫీలు దిగి సందడి చేసారు.
ఆ క్రమంలోనే కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తో పవన్ దిగిన సెల్ఫీ, సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. జానీ మాస్టర్ ను గట్టిగా పట్టుకుని స్వయంగా పవనే సెల్ఫీ తీయడం విశేషం. ‘చాలాకాలం తర్వాత పవన్ పాటకు కొరియోగ్రఫీ చేయడం తనకు చాలా సంతోషాన్ని ఇచ్చిందని, సదరు సెల్ఫీ ఫోటోను షేర్ చేసుకుంటూ’ జానీ మాస్టర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఈ ఫోటోలో పవర్ స్టార్ ఫుల్ షేవ్ చేసుకుని పంచెకట్టుతో అదిరిపోయే లుక్ లో దర్శనమిస్తున్నారు. వచ్చే ఏడాది ఉగాది నాటికి ఈ సినిమాను విడుదల చేయాలని ప్లానింగ్ జరుగుతోంది.



