Pawan Kalyan Speech at the meeting of legal cell at Janasena office ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలలో జనసేన పార్టీ 8 ఏళ్ళుగా ఉంది. ఇప్పుడిప్పుడే నిలద్రొక్కుకొంటోంది. పవన్‌ కళ్యాణ్‌ చెప్పినట్లు జనసేనను 10 సీట్లు వచ్చినా నేడు దాని పనితీరు, పోరాటం మరో స్థాయిలో ఉండేది. అయితే అధికారంలోకి రావడమే లక్ష్యంగా కాక విభజన సమస్యలు, రాష్ట్ర అవసరాలను దృష్టిలో ఉంచుకొని వెనక్కు తగ్గడం వలన ఒకసారి, ప్రజధారణను ఓట్ల రూపంలోకి మార్చుకోవడంలో విఫలమవడం వలన మరోసారి శాసనసభలో అడుగుపెట్టలేకపోయింది.

అంతటితో జనసేన పార్టీ కధ ముగిసిపోతుందని, పవన్‌ కళ్యాణ్‌ జనసేన పార్టీని మూసేసి మళ్ళీ సినిమాలు చేసుకొంటారని చాలామంది అనుకొన్నారు. రెండో ఓటమి దెబ్బకి పవన్‌ కళ్యాణ్‌ చాలా నిరాశ చెందినప్పటికీ ధైర్యం కోల్పోలేదు. ఈ మూడేళ్ళలో రాజకీయాలను కాస్త తగ్గించుకొని సినిమాలు చేసిన మాట నిజమే కానీ జనసేన మనుగడకు సినిమాలు చేయడం తప్పనిసరైందని పవన్‌ కళ్యాణ్‌ అనేకసార్లు చెప్పారు. అది వేరే విషయం.

కానీ ఈ ఎనిమిదేళ్ళలో అనుభవంలో పవన్‌ కళ్యాణ్‌ కూడా రాజకీయాలలో కాస్త రాటు తెలినట్లే ఉన్నారు. ఆదివారం మంగళగిరిలో జనసేన కార్యాలయంలో లీగల్ సెల్ సమావేశంలో ఆయన ప్రసంగం వింటే ఈ విషయం అర్దమవుతుంది.

“రాష్ట్ర విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ మళ్ళీ నిలద్రొక్కుకోవాలంటే రాష్ట్రంలో సుస్థిరమైన ప్రభుత్వం అవసరమని భావించాము. ఎంతో మంది పెద్దలు, మేధావులను సంప్రదించిన తర్వాతే టిడిపికి మద్దతు ఇచ్చాము తప్ప గుడ్డిగా మద్దతు ఇవ్వలేదు. అందువల్లే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా గత ప్రభుత్వ హయంలో ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతికి బీజం పడింది. అయితే వేల ఎకరాలలో రాజధాని నిర్మించడం కంటే చిన్న రాజధాని నిర్మించుకోవాలని నేను టిడిపి ప్రభుత్వానికి సూచించాను కానీ ఆ విషయంలో టిడిపి ప్రభుత్వ ఆలోచనలు భిన్నంగా ఉన్నాయి కనుక ఆ విదంగానే ముందుకు సాగి కొన్ని పనులు పూర్తి చేసింది కూడా.

అప్పుడు ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ కూడా అమరావతిని రాజధానిగా అంగీకరించింది. కానీ ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక మాట మార్చింది. ఒక ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాన్ని తర్వాత వచ్చిన ప్రభుత్వం అమలుచేయకపోవడం సమంజసమేనా?రాజధానిపై మాట నిలబెట్టుకోని వైసీపీ ప్రభుత్వానికి రాజధానిపై చట్టాలు చేసే అర్హత ఉంటుందా?మూడు రాజధానులు అంశంతో వైసీపీ ఎన్నికలకు వెళ్ళి ప్రజామోదం పొందగలదా?వచ్చే ఎన్నికలలో 175 సీట్లు తమకే అంటోంది. కానీ వైసీపీకి 47-67కి మించి సీట్లు రావు.

మనం అధికారం కోసం ప్రాకులాడితే వేరే విదంగా రాజకీయాలు చేసి ఉండేవాళ్ళం కానీ రాష్ట్ర అవసరాలు, అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మనం పనిచేస్తున్నాము. గత ఎన్నికలలో మనకి కనీసం 10 సీట్లు వచ్చినా మన పోరాటాలు వేరే స్థాయిలో ఉండేవి. పది సీట్లు రాకపోయినా నేటికీ ప్రజాసమస్యలపై మనం పోరాటం చేస్తూనే ఉన్నాము. ఈ విషయం ప్రజలు కూడా గుర్తించే ఉంటారు.

కనుక వచ్చే ఎన్నికలలో మనకు బలం ఉన్న స్థానాలలో పోటీ చేసి గెలిచేందుకు ఇప్పటి నుంచే గట్టిగా కృషి చేద్దాం. ముందుగా ఆయా నియోజకవర్గాలను గురించి అభ్యర్ధులను ఖరారు చేసుకొందాము. అక్టోబర్‌లో జరపాలనుకొన్న జనసేన యాత్రను వాయిదా వేయిస్తున్నాను. పార్టీని బలోపేతం చేసుకొనే అంశంపై పార్టీలో చర్చలు, అధ్యయనం జరిగిన తర్వాత జనసేన యాత్రను పెట్టుకొందాం. మనం అధికారం కోసం తొందరపడటంలేదు,” అని అన్నారు.

పవన్‌ కళ్యాణ్‌ ప్రసంగంలో ముఖ్యంగా మూడు విషయాలు గమనించవచ్చు. 1. జనసేన అమరావతికి కట్టుబడి ఉంది. 2. ఈసారి జనసేనకు బాగా బలముందని భావిస్తున్న సీట్లలో మాత్రమే పోటీ చేయబోతోంది. 3. ముఖ్యమంత్రి కావాలనే ఆలోచనను పవన్‌ కళ్యాణ్‌ పక్కనపెట్టేశారు.

పవన్‌ కళ్యాణ్‌ మాటలలో ఇప్పుడు రాజకీయ పరిణతి స్పష్టంగా కనిపిస్తోంది. ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో కూడా పవన్‌ కళ్యాణ్‌ గ్రహించినట్లే ఉన్నారు. పవన్‌ కళ్యాణ్‌ తాజా నిర్ణయాలు టిడిపితో పొత్తులకి మార్గం సుగమం చేస్తాయి. కనుక వచ్చే ఎన్నికలలో రెండు పార్టీలు కలిసి పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ జనసేన, టిడిపిలు కలిస్తే వాటితో బిజెపి కూడా కలిసే అవకాశం ఉండవచ్చు.