పిఠాపురం నియోజకవర్గం నుండి ఈసారి ఎన్నికల బరిలో దిగబోతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండే ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టారు. గొల్లప్రోలులో ఏర్పాటు చేసిన వారాహి యాత్రలో పాల్గొన్న పవన్ స్థానిక ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
పిఠాపురం వంటి ఆత్యాత్మిక ప్రదేశాన్ని వైసీపీ దందాలకు డ్రగ్స్ కు అడ్డాగా మార్చుకున్నారని..,ఇక్కడ స్థానికంగా ఉన్న వైసీపీ నాయకులు డాన్ల మాదిరి తయారయ్యి కాకినాడ పోర్టు నుండి అక్రమ బియ్యం రవాణా, డీజిల్ వంటి వాటిని సరఫరా చేస్తూ వేల కోట్లు సంపాదించుకున్నారని 2024 ఎన్నికలలో ఇటువంటి నాయకులను ఇంటికి పంపాల్సిన సమయం ఆసన్నమయిందని స్థానిక ప్రజలకు పిలుపునిచ్చారు.
పిఠాపురంలోనే ఇల్లు తీసుకుని ఇక్కడి స్థానిక ప్రజలకు అందుబాటులో ఉంటానంటూ పిఠాపురం ప్రజలకు హామీ ఇచ్చారు పవన్. ఇన్నాళ్లు ఆవేశంతో కూడిన ప్రసంగాలు చేసి పవన్ అభిమానులను ఆకట్టుకునే పవన్ ఇప్పుడు ఆలోచనతో కూడిన ప్రసంగాలు చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
స్థానికంగా ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలను గురించి ప్రస్తావించిన పవన్ తాను విజయం సాధించిన తరువాత చేయబోతున్న పరిష్కారాలను కూడా వివరించారు. పేదలకు – పెత్తందారులకు మధ్య యుద్ధం అంటూ జగన్ చేస్తున్న వ్యాక్యలకు తన ప్రశ్నలతో కౌంటర్ వేశారు పవన్. మాస్కులు అడిగిన పాపానికి ఒక దళిత డాక్టర్ సుధాకర్ పై దాడి చేసి ఆయన చావుకు కారణమైన మీరా పేదలు.?
సాక్షి పేపర్, భారతి సిమెంట్, మద్యం వ్యాపారం, బినామీ పేర్లతో ఫ్యాక్టరీలు నడుపుతున్న మీరా పేదలు.? అనేక దేవాలయాల విధ్వంసానికి కారణమైన ఏఒక్కరినైనా ఈ వైసీపీ ప్రభుత్వం గుర్తించగలిగిందా..? ఇటువంటి వారి పై చర్యలు తీసుకోలేని ప్రభుత్వం మనకు అవసరమా..? ఈ ఐదేళ్లలో రాష్ట్రాన్ని కొల్లగొట్టి వైసీపీ సంపాదించిన అక్రమ సంపాదన అంతా కంటైనర్లలో ఇక్కడ కాకినాడ పోర్టులో దాచాడు స్థానిక వైసీపీ డాన్ అంటూ తాడేపల్లి కంటైనర్ల భాగోతం మరోసారి తెరమీదకు తెచ్చారు పవన్.
పిఠాపురం లోని 54 గ్రామాల ప్రజలను మొదటిసారిగా అడుగుతున్నా కులానికి, మతానికి అతీతంగా మీ ఆశీర్వాదం నాకివ్వండి. నన్ను గెలిపించండి అంటూ స్థానిక ప్రజలను అభ్యర్ధించారు పవన్. పవన్ వారాహి యాత్రలో టీడీపీ అభ్యర్థి వర్మ, కాకినాడ జనసేన పార్లమెంట్ అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ పాల్గొన్నారు. సభకు భారీ సంఖ్యలో వచ్చిన ఈ జనసమూహాన్ని ఓటర్లుగా మార్చుకోగలిగితే ఈ సారి జనసేనాని విజయం అనివార్యమే.






