ప్రస్తుతం ధియేటర్లలో సందడి చేస్తోన్న ‘స్పైడర్’ సినిమా ఫస్ట్ లుక్ విషయంలో ప్రిన్స్ అభిమానులు ఎంతగా నిరీక్షించారో అందరికీ తెలిసిందే. ప్రతి పండగ రావడం ఇదిగో ఫస్ట్ లుక్, అదిగో ఫస్ట్ లుక్ అంటూ ఫ్యాన్స్ హంగామా చేయడం గతేడాది కాలంగా చూస్తూనే ఉన్నాం. అయితే అలా వాయిదాలు వేసుకుంటూ వేసుకుంటూ… ఎట్టకేలకు కృష్ణ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం పవర్ స్టార్ అభిమానుల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఫస్ట్ లుక్ కోసం కళ్ళు కాయలు కాసేలా నిరీక్షిస్తున్న నేపధ్యంలో… పవర్ స్టార్ పుట్టినరోజున ఓ కుర్చీ తిప్పే సీన్ ను మాత్రం చూపించిన అభిమానులకు, ఈ విజయదశమి సందర్భంగా టైటిల్ తో కూడిన ‘ఫస్ట్ లుక్’ విడుదల అవుతుందని భావించారు. అయితే పండగ వచ్చింది గానీ, ఫ్యాన్స్ ఆశించిన ‘ఫస్ట్ లుక్’ జాడ లేదు.
దీంతో విజయదశమి నుండి దీపావళికి పవర్ స్టార్ సినిమా ఫస్ట్ లుక్ పోస్ట్ పోన్ అయినట్లుగా తెలుస్తోంది. అయితే కనీసం దీపావళికైనా సందడి చేస్తాడా? అన్నది ప్రశ్నార్ధకంగానే ఉంది. అందులోనూ గతేడాది దీపావళికి విడుదల చేసిన ‘కాటమరాయుడు’ ఫలితం ఫ్యాన్స్ ఆశించినది కాకపోవడంతో, మళ్ళీ దీపావళికి ‘ఫస్ట్ లుక్’ తీసుకురావడం సెంటిమెంట్ పరంగా అడ్డంకిగా మారుతోంది. విడుదలకు ముందు ప్రిన్స్ ఫ్యాన్స్ కు ‘స్పైడర్’ ఎలాంటి అనుభూతులను పంచిందో, ప్రస్తుతం పవర్ స్టార్ ఫ్యాన్స్ కు కూడా త్రివిక్రమ్ సినిమా అలాంటివే మిగులుస్తోంది.


