గత కొంతకాలంగా పవర్ స్టార్ అభిమానులు చేస్తున్న నిరీక్షణకు ఈ దీపావళి తెరవేస్తుందని అంతా భావించారు. కానీ ఈ సారి కూడా అదే నిరాశ ఎదురయ్యింది. దీపావళి సందర్భంగా త్రివిక్రమ్ – పవన్ ల సినిమా టైటిల్ ప్రకటనతో కూడిన పోస్టర్ విడుదల అవుతుందని ఇటీవల ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. దీంతో తమ అభిమాన హీరో దర్శనం కానుందన్న సంబరాల్లో పవన్ ఫ్యాన్స్ ఉండగా, ఈ దీపావళి కూడా వారిలో కళాకాంతులను నింపలేకపోయింది.
పవన్ సినిమాను నిర్మిస్తున్న చిత్ర నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నుండి పోస్టర్ అయితే విడుదలైంది గానీ, అందులో పవర్ స్టార్ లేకపోవడంతో ఫ్యాన్స్ నిరుత్సాహం చెందారు. కేవలం దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ ఓ పోస్టర్ ను రిలీజ్ చేసారు తప్ప, అందులో పవన్ గానీ, సినిమా టైటిల్ గానీ లేకపోవడంతో, పవర్ స్టార్ అభిమానుల నిరీక్షణ మరికొంత కాలం కొనసాగే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి.
పవర్ స్టార్ లేని ‘దీపావళి శుభాకాంక్షలు’ పోస్టర్ ను విడుదల చేయడం వెనుక ఆంతర్యం ఏమిటో గానీ, ఈ సినిమాపై ఉత్సుకత అంతకంతకూ పెరిగిపోతోంది. సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమా టాలీవుడ్ రికార్డులను బ్రేక్ చేసి ‘బాహుబలి 2’ తర్వాత స్థానంలో నిలుస్తుందని అభిమానులు ఎంతో ఆశగా ఉన్నారు. మరి వారి ఆశలకు, ఆశయాలకు ముందుగా ఓ శాంపిల్ వీడియో కావాలన్న డిమాండ్ ఎక్కువవుతోంది.



