జనసేనాని పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా ‘దేనికీ గర్జనలు? అంటూమరోసారి వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. “మూడు రాజధానులతో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడానికా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ అసెంబ్లీలో చెప్పిన దానికి భిన్నంగా చేస్తున్నందుకా?ఉత్తరాంద్ర నుంచి వలసలు ఆపలేకపోయినందుకా? మత్స్యకారులకు సొంత తీరంలో వేటకు అవకాశం లేక గోవా, గుజరాత్, చెన్నై వెళ్ళిపోతున్నందుకా? విశాఖపట్నంలో ఋషికొండను అడ్డగోలుగా ధ్వంసం చేసి మీకోసం భవనం నిర్మించుకొంటున్నందుకా? దసపల్లా భూములను మీ సన్నిహితులకు ధారాదత్తం చేసేలా ఆదేశాలు ఇచ్చినందుకా?” అంటూ వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీశారు.
విశాఖలోనే కార్యనిర్వాహక రాజధాని ఏర్పాటుచేయాలంటూ వైసీపీ నేతలు ర్యాలీలు, గర్జనలు, రాజీనామా డ్రామాలు మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. విశాఖలో రాజధాని ఏర్పాటుచేస్తే ఉత్తరాంద్ర జిల్లాలు అభివృద్ధి చెందుతాయని వైసీపీ మంత్రులు వాదిస్తున్నారు. అయితే రాజధాని పేరుతో విశాఖ జిల్లాలో జరుగుతున్న ఈ భూముల దోపిడీ, పచ్చటి ఋషికొండను తవ్వేసి పెద్ద మట్టి దిబ్బగా మార్చేయడం విశాఖలో జరుగబోయే విధ్వంసానికి ‘కొండంత నిదర్శనం’గా కనిపిస్తోంది.
విశాఖపట్నం అభివృద్ధి చెందింది కనుకనే అక్కడ విలువైన భూములపై కన్నేసిన వైసీపీ నేతలు విశాఖపై కపట ప్రేమ ఒలకబోస్తున్నారనే వాదన ఎప్పటి నుంచో వినిపిస్తోంది. వారికి విశాఖపట్నంతో సహా ఉత్తరాంద్రలో ఆస్తుల కూడగట్టుకోవడంలో ఉన్న శ్రద్ద ఆయా జిల్లాల అభివృద్ధి చేయడంపై లేదనే విషయమే పవన్ కళ్యాణ్ తన తాజా ట్వీట్స్ ద్వారా తెలియజెప్పారని భావించవచ్చు.
ఒకవేళ వైసీపీ నేతలకు నిజంగా విశాఖ నగరాన్ని, ఉత్తరాంద్ర జిల్లాలను అభివృద్ధి చేసుకోవాలనే తపన ఉండి ఉంటే ముందుగా ఎక్కడికక్కడ పరిశ్రమలను, ఐటి కంపెనీలను నెలకొల్పి స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించి ఉండేవారు. కానీ ఉన్న ఐటి కంపెనీలే హైదరాబాద్‌కు తరలిపోతుండటంతో నేటికీ యువత ఉద్యోగాల కోసం హైదరాబాద్, బెంగళూరుకి వలసలు వెళ్ళవలసి వస్తోంది. చివరికి మత్స్యకారులు కూడా పొరుగు రాష్ట్రాల సముద్రతీరాలకు చేపల వేటకు వెళ్ళవలసివస్తోందంటే ఇంతకన్నా దారుణం ఏముంటుంది?
ఉత్తరాంద్ర ప్రజల తరపున ఓ ప్రతిపక్ష నాయకుడిగా పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వాన్ని అడిగిన ఈ ప్రశ్నలకు వైసీపీ నేతలు సమాధానం చెప్పలేక ఆయనపై ఎదురుదాడి చేసి గొంతు నొక్కేయాలని ప్రయత్నిస్తుండటం చాలా దురదృష్టం.
తమ అధినేత జగన్‌ను ప్రసన్నం చేసుకోవడం కోసం ప్రజల ఆకాంక్షలు, అభిప్రాయాలను గుర్తించకుండా ఈవిదంగా వ్యవహరిస్తున్న వైసీపీ నేతలందరూ వచ్చే ఎన్నికలలో తామే నష్టపోతామని గ్రహించినట్లు లేరు. గతంలో ప్రజల భావోద్వేగాలను, అభిప్రాయాలను గౌరవించకుండా రాష్ట్ర విభజన చేసినందుకు కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేసిన సంగతి వైసీపీ నేతలు మరిచిపోయినట్లున్నారు. ఇప్పుడూ వారు అదే తప్పు చేస్తున్నారని చెప్పక తప్పదు.
నిజానికి మూడు రాజధానుల ప్రతిపాదన ప్రజల ఆకాంక్షల నుంచి పుట్టుకొచ్చినది కాదు తమ అధినేత మనసులో నుంచి పుట్టిన వెర్రి ఆలోచన అని వారికీ తెలుసు. కానీ ఆయనను వ్యతిరేకించలేక గుడ్డిగా సమర్ధిస్తూ వారు ప్రజలను దూరం చేసుకొంటున్నారు. గడప గడపకి కార్యక్రమంలో వారికి ఎదురైన చేదు అనుభవాలే ఇందుకు సాక్ష్యం!
రాజధాని రైతుల గొంతులను లేదా ప్రతిపక్ష నేతల, మీడియా గొంతులు నొక్కేసినంత మాత్రన్న వచ్చే ఎన్నికలలో రాష్ట్ర ప్రజలందరి గొంతులు నొక్కేయడం సాధ్యం కాదని గ్రహిస్తే వారికే మంచిది. లేకుంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ బలైపోయినట్లే ఇప్పుడు ఈ మూడు రాజధానుల విధ్వంసానికి వైసీపీ నేతలు కూడా బలైపోవడం ఖాయం. ఏ సంక్షేమ పధకాలు వారిని కాపాడలేవు.



