ప్రజారాజ్యం మూతపడిన తర్వాత పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించినప్పుడు అది కూడా అలాగే మూతపడుతుందని చాలా మందనుకున్నారు.
ఆ పార్టీని ప్రారంభించిన తీరు, ఆయన రాజకీయ నిర్ణయాలు, ఆవేశం, ఆశయాలు, పార్టీ నడిపించడానికే సినిమాలు చేస్తున్నానని చెప్పడం వంటివన్నీ కూడా జనసేన మూత పడుతుందనే ఆభిప్రాయాలని బలపరిచేవి.
కానీ పవన్ కళ్యాణ్ ఆటుపోట్లన్నీ తట్టుకొని, ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గుతూ చాలా సహనంగా ముందుకు సాగారు. పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయిన పరిస్థితి నుంచి పోటీ చేసిన అన్ని స్థానాలలో విజయం సాధించే స్థాయికి జనసేన ఎదిగింది. తొలిసారిగా రాష్ట్రంలో జనసేన అధికారంలోకి రాగలిగింది.
కొత్తగా రాజకీయ పార్టీలు పెట్టాలనుకునేవారికి, ఇప్పటికే సొంత కుంపట్లు పెట్టుకున్నవారికీ జనసేన, దాని అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోరాటాలను ‘ఓ కేస్ స్టడీ’గా స్వీకరించవచ్చు. అప్పుడే తమకు అంత శక్తి సామర్ధ్యాలు, ఓర్పు, రాజకీయ అవకాశాలు ఉన్నాయో లేవో వారు అర్ధం చేసుకోగలుగుతారు.
ఇంతకీ ఇప్పుడు జనసేన ప్రస్తావన దేనికంటే, ఆనాడు కల్వకుంట్ల కవిత ‘జనసేన ఓపెన్ అండ్ షట్ పార్టీ’ అని ఎద్దేవా చేశారు.
ఇప్పుడు ఆమె బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చి తెలంగాణ జాగృతితో ముందుకు సాగుతానని చెపుతున్నారు. కానీ ఒకే ఒక్క ప్రెస్‌మీట్‌తోనే మొదటి నుంచి జాగృతిలో ఆమె వెంట ఉన్న పలువురు సీనియర్లు గుడ్ బై చెప్పేసి బయటకు వెళ్ళిపోయారు!
తెలంగాణలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఉందని, కనుక తాను బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చినా రాజకీయాలలో చక్రం తిప్పగలనని అనుకుంటే మొదట్లోనే పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. కనుక ఇక్కడ ఆమె జనసేన, పవన్ కళ్యాణ్ నుంచి ఓ పాఠం నేర్చుకోవడం చాలా అవసరం.
ఆనాడు పవన్ కళ్యాణ్ కావాలనుకుంటే ‘ప్రజారాజ్యం’తోనే ముందుకు సాగగలిగేవారు. కానీ ఆ ‘మెగాముద్ర’కి ఆశ పడకుండా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఉండాలనుకున్నారు. అందుకే జనసేన స్థాపించారు. ఇప్పుడు కవిత చేయాల్సింది కూడా ఇదే.
నేటికీ ఆమె “జై కేసీఆర్” అంటూ “కల్వకుంట్ల లేబుల్” తగిలించుకొని రాజకీయాలు చేస్తున్నారు. పైగా బీఆర్ఎస్ పార్టీకి అనుబందంగా ఉన్న తెలంగాణ జాగృతితో ముందుకు సాగుతున్నారు.
కనుక ఈ పాత ముద్రలు, పాత లేబిల్స్, రాజకీయ బంధాలు అన్నీ తెంచుకొని తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకోగలిగితేనే ప్రజలైనా, రాజకీయ నాయకులైన ఆమెను నమ్ముతారు. లేకుంటే ఆమెని కేసీఆర్‌కి, బీఆర్ఎస్ పార్టీకి బీ-టీమ్‌గానే చూస్తుంటారు. కనుక రాజకీయంగా ఆమె ఎదగలేరు.




