వైసీపీ ఎంపీ కుటుంబం కిడ్నాప్ కేసు… బహుశః కమీషన్ల వ్యవహారమే!

Penmetsa Vishnu Kumar Raju Responds on Ayyanna Patrudu Arrestవిశాఖ వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబం, ఆడిటర్ జీవీలను కొందరు దుండగులు రెండురోజుల పాటు ఋషికొండలో వారి ఇంటిలోనే నిర్బందించి హింసించడం, తర్వాత పోలీసులకు పట్టుబడటంపై బిజెపి మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, “ఎంపీ భార్య, కుమారుడు, ఆడిటర్ జీవీలను కిడ్నాప్ చేసి రెండు రోజులు హింసించడం నాకు చాలా బాధ కలిగించింది. అయితే ఎక్కడైనా కిడ్నాప్ చేసిన వ్యక్తులు వెంటనే వారిని ఎత్తుకుపోతారు కానీ వారి ఇంట్లోనే రెండు రోజులు గంజాయి సేవిస్తూ, మద్యం తాగుతూ గడపరు కదా?ఒకవేళ ఉన్నా వారి సెల్ ఫోన్లు ఆన్‌ చేసి ఉంచుకోరు కదా? కానీ ఉన్నారంటే వారి వెనుక ఎవరో చాలా పెద్దవాళ్ళున్నారని నాకు అనుమానం కలుగుతోంది.

ADVERTISEMENT

వివేకా హత్య కేసులా ఈ కిడ్నాప్ వ్యవహారం కూడా కడప కేంద్రంగా సాగిందా లేక నిజంగానే దుండగులు కిడ్నాప్ చేశారా? అనేది తెలియాలంటే రాష్ట్ర పోలీసులు కాకుండా సీబీఐ లేదా ఎన్ఐఏ దర్యాప్తుకు ఆదేశించాలని నేను డిమాండ్‌ చేస్తున్నాను. ఎందుకంటే వైసీపీ నేతలే పోలీసుల బాసులు కనుక వారు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయలేరని నేను భావిస్తున్నాను.

ఎంవీవీ సత్యనారాయణ చాలా సౌమ్యుడు. ఎవరితో గొడవలు పడే వ్యక్తి కాదు. కనుక ఆయనకు శత్రువులు ఎవరూ ఉండకపోవచ్చు. అందుకే ఆయన ఎటువంటి రక్షణ లేకుండా ఒంటరిగానే తిరుగుతుంటారు. కానీ ఇప్పుడు ఆయన కుటుంబ సభ్యులు కిడ్నాప్‌కు గురయ్యారంటే బహుశః కమీషన్ల వ్యవహారమే కారణం అయ్యుండవచ్చని నేను అనుమానిస్తున్నాను.

ఆయన వైసీపీలోనే ఉన్నప్పటికీ భారీగా భూముల క్రయవిక్రయాలు జరిపినప్పుడు తప్పనిసరిగా పైవాళ్ళకు కమీషన్లు చెల్లించాల్సి ఉంటుందని అందరికీ తెలుసు. కనుక ఆ కమీషన్ల చెల్లింపులో ఏదో తేడా వస్తే, ఎవరికో ఆయన మీద కోపం కలిగి ఉంటుంది. వారే ఆయనకు తమ సత్తా చూపి భయపెట్టేందుకు ఈ కిడ్నాప్ కధ నడిపించి ఉండవచ్చని నాకు అనుమానంగా ఉంది. కనుక దీని వెనుక ఎవరున్నారో తెలియాలంటే సీబీఐ లేదా ఎన్ఐఏ దర్యాప్తుకు ఆదేశించాల్సిందే.

అధికార పార్టీకే చెందిన ఓ ఎంపీ కుటుంబం కిడ్నాప్ చేయబడితే రాష్ట్రంలో శాంతిభద్రతలు అద్భుతంగా ఉన్నాయని డిజిపి చెప్పుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉంది. రెండు రోజుల క్రితమే గుంటూరులో పదో క్లాసు చదువుతున్న ఓ విధ్యార్ధిని పెట్రోల్ పోసి దారుణంగా కాల్చి చంపేశారు. అంతకు ముందు ఓ బాలికపై అత్యాచారం జరిగింది. అంగన్వాడీ టీచర్ సరస్వతిని పట్టపగలు నడిరోడ్డుపై ట్రాక్టరుతో తొక్కించి చంపేశారు.

అందుకే కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా రాష్ట్రంలో అరాచక పరిస్థితులు నెలకొని ఉన్నాయని హెచ్చరించారు. జగన్ ప్రభుత్వానికి శాంతి భద్రతలు ఎలా కాపాడాలో తెలియకపోతే తన పోలీస్ ఉన్నతాధికారులను ఓ సారి ఉత్తర్ ప్రదేశ్‌కు పంపిస్తే, అక్కడ సిఎం యోగి ఏవిదంగా కంట్రోల్ చేశారో తెలుసుకొని వస్తారు. ఇప్పుడు యూపీలో గూండాలు బయట ఉండటం కంటే జైల్లో ఉండటమే తమకు క్షేమమని భావిస్తున్నారంటే అర్దం చేసుకోవచ్చు. ఏపీలో మేము అధికారంలోకి వస్తే అలాగే రాష్ట్రంలో గూండాలు అందరినీ ఏరేస్తాము,” అని అన్నారు.

ADVERTISEMENT
Latest Stories