సాధారణంగా అధికార పార్టీ నేతల లోపాలు, అవినీతి, అక్రమాలను ప్రతిపక్షాలు బయటపెట్టి విమర్శిస్తుంటాయి కానీ ఏపీ వైసీపీ ప్రభుత్వంలో మంత్రుల, ఎమ్మెల్యేల భాగోతాలను ఆ పార్టీ నేతలే బయటపెట్టుకొంటున్నారు.
నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పెర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డిపై 2014లో కల్తీ మద్యం కేసు నమోదైంది. టిడిపి హయాంలో ఆయనపై నమోదైన కేసు వైసీపీ అధికారంలోకి వచ్చాక మాఫీ అయిపోతుందనే ఎవరైనా భావిస్తారు. కానీ నేటికీ ఆ కేసులో ఆయన కోర్టుల చుట్టూ, సెబ్ నెల్లూరు2 కార్యాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఆయనపై బైండోవర్ కేసు కూడా కొనసాగుతూనే ఉంది. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖ తన ఇంటిపై దాడిచేయడానికి సిద్దంగా ఉందనిపెర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి చెపుతున్నారు.
నకిలీ మద్యం కేసులో విచారణకు సోమవారం సెబ్ నెల్లూరు 2 కార్యాలయానికి రావాలని ఆదేశించడంతో తాను వచ్చానని కానీ తీరా అక్కడికి వచ్చిన తరువాత ఎవరూ కనబడలేదని, ఎస్సై వెంకటేశ్వరరావుకు తాను ఫోన్ చేసి అడిగితే మేమేమీ పిలవలేదని జవాబు చెప్పారని శ్యాంప్రసాద్ రెడ్డి అన్నారు.
తాను అధికార పార్టీకి చెందినవాడినే అయినప్పటికీ గత 8 ఏళ్లుగా అందరూ కలిసి తనను వేధిస్తున్నారని శ్యాంప్రసాద్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నకిలీ మద్యం కేసులో మంత్రి కాకణి గోవర్దన్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి కూడా ఉన్నారని కానీ వారిరువురినీ విడిచిపెట్టి పోలీసులు తన వెంటపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకే పార్టీలో ఉన్న నాకొక న్యాయం వారికొక న్యాయమా ?అని శ్యాంప్రసాద్ రెడ్డి ప్రశ్నించారు. ఇకనైనా పోలీసులు ఈ కేసు దర్యాప్తును పూర్తి చేసి తనకు విముక్తి కల్పించాలని లేకుంటే మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తానని శ్యాంప్రసాద్ రెడ్డి హెచ్చరించారు.



