మాజీ మంత్రి పేర్ని నాని ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ టీవీ9కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు వింటే, వైసీపీ నేతల పరిస్థితి ఏవిదంగా ఉందో అర్దమవుతుంది.
“రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలందరూ సభలు, కులసంఘాలతో, వివిదవర్గాలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు కదా? ఆ ప్రభావం ప్రజలపై ఉండదా?వారు అన్ని సభలు, సమావేశాలు నిర్వహిస్తుంటే, మీ పార్టీ తరపున గడప గడపకి కార్యక్రమం, ముఖ్యమంత్రి బటన్ నొక్కుడు సభలు తప్ప మరేమీ నిర్వహించడం లేదు కదా?అయినా ప్రజలు మీకు 175 సీట్లు ఇస్తారని నమ్ముతున్నారా?” అని టీవీ9-రజనీకాంత్ ప్రశ్నించారు.
దానికి పేర్ని నాని సమాధానం చెపుతూ, “వారందరూ ఎవరికి వారు సభలు నిర్వహించడం లేదు. అందరూ కూడబలుక్కొనే చేస్తున్నారు. గతంలో మేము అధికారంలో లేనప్పుడు, ఇప్పుడు కూడా… వారందరూ మా జగనన్ననే విమర్శిస్తున్నారు. ఆయన మమ్మల్ని నిలబెట్టి మాట్లాడుతారనో లేదా గుళ్ళోకి చెప్పులు వేసుకొని వెళ్ళారనో ఏదో పేరుతో ఆయన ‘క్యారక్టర్ ఆసాసినేషన్’ చేస్తూనే ఉన్నారు. అయితే ఆయన ఇటువంటి వాటికి భయపడే వ్యక్తి కాదు. ఆయన ప్రజలకు మేలు చేయాలనుకొన్నారు. చేసుకుపోతున్నారంతే!
అందుకే 175 సీట్లు గెల్చుకొంటామని జగనన్న ధైర్యంగా చెపుతున్నారు. మా ఎమ్మెల్యేలలో 18 మంది పనితీరు బాగోలేదని చెప్పిన మాట వాస్తవం. ఆ విషయం ఇప్పటికే వారికి తెలియజేశారు. అయితే ఇంకా అక్టోబర్ వరకు సమయం ఉంది కనుక ఆలోగా ఆయన వారినీ పనితీరు మెరుగు పరుచుకోమని మాత్రమే చెపుతున్నారు.
ఎన్నికల ముందు ప్రజల వద్దకు వెళ్ళి వారి ఆగ్రహాన్ని చవిచూసే బదులు ఇప్పటి నుంచే వారిచేత నాలుగు తిట్లు తిన్నా తప్పులేదు. అప్పటికి వారి ఆగ్రహం చల్లారుతుంది కదా?
అయినా ప్రభుత్వం పనితీరు, ఎమ్మెల్యేల పనితీరుకి సంబంధం లేదు. మా ప్రభుత్వం బాగా పనిచేస్తోందని ప్రజలు భావిస్తున్నప్పటికీ, కొంతమంది ఎమ్మెల్యేల పనితీరు వారికి నచ్చకపోవచ్చు. అందుకు రకరకాల కారణాలు ఉంటాయి. కనుక 18 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగోకపోతే దానర్దం ప్రభుత్వం పనితీరు బాగోలేదని కాదు. జగనన్న ప్రజలను, దేవుడిని నమ్ముకొని ఉన్నారు. మేము ఆయననే నమ్ముకొని ఉన్నాము. కనుక ప్రతిపక్షాలు ఎన్ని సభలు, సమావేశాలు నిర్వహించుకొన్నా మాకు నష్టం, భయం లేవు,” అని అన్నారు.
తమ ప్రభుత్వం పనితీరు బాగోలేదని పేర్ని నానికి తెలియదనుకోలేము. అందువల్లే రాష్ట్రంలో ప్రతిపక్ష నేతల సభలు, రోడ్ షోలు, పాదయాత్రలకు ప్రజలు అంతగా స్పందిస్తున్నారని కూడా తెలిసే ఉంటుంది. వైసీపీకి, సిఎం జగన్మోహన్ రెడ్డికి కంచుకోటగా చెప్పుకోబడే కడప జిల్లాలోనే నారా లోకేష్‌కు ప్రజలు నీరాజనాలు పట్టారంటే తాము చెప్పుకొంటున్నట్లు పరిస్థితులు లేవని తెలిసే ఉంటుంది.
అలాగే బిజెపి కూడా తమ ప్రభుత్వం యుద్ధం ప్రకటించడంతో రాష్ట్రంలో రాజకీయ బలాబలాలు మారిపోతాయని, మున్ముందు ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుందని కూడా పేర్ని నానికి తెలిసే ఉంటుంది. అయినప్పటికీ పిల్లి మెడలో గంటెవరు కడతారన్నట్లు, రాష్ట్రంలో మారుతున్న ఈ రాజకీయ వాతావరణాన్ని చూస్తూ కూడా వైసీపీలో అందరూ జగనన్న భజన చేస్తూ కాలక్షేపం చేసేస్తున్నారు. ఎందుకంటే పేర్ని నాని చెప్పారు కదా, జగనన్న ప్రజలని, తాము ఆయనని నమ్ముకొని (గుడ్డిగా) ముందుకు సాగిపోతున్నామని!



