పోలీసులకు దశావతారాలు… తప్పవు!

Former minister Perni Nani arguing with police officers at Machilipatnam station

సినిమా హీరోలు డబుల్ రోల్ త్రిబుల్ రోల్ కుదిరితే పది రోల్స్ కూడా చేస్తుంటారు. మన దేశంలో పోలీసులు కూడా చట్టం, శాంతి భద్రతల పరిరక్షకుడు, రాజకీయ నేతల ప్రాణాలు కాపాడేవాడు, వారి రాజకీయాలలో పావుగా, రాజకీయ బలి పశువు, కొన్ని సందర్భాలలో విలన్‌ పాత్ర కూడా చేస్తుంటారు.

అధికార పార్టీ నేతల పట్ల విధేయంగా వ్యవహరిస్తూ వారికి నచ్చినట్లు పనిచేయాలి. అదే సమయంలో ప్రతిపక్షనేతలకి కూడా ఆగ్రహం కలిగించకూడదు. వారి పట్ల విధేయంగానే వ్యవహరించాలి. లేకుంటే మళ్ళీ వారు అధికారంలోకి వచ్చినప్పుడు వారు కక్ష తీర్చుకుంటారు.

ADVERTISEMENT

ఇలా అధికార, ప్రతిపక్షాలకి మద్య నలిగిపోతూనే ‘మేము రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా స్వేచ్చగా, నిర్భయంగా చట్ట ప్రకారమే పనిచేస్తాము. ఎవరి ఒత్తిళ్ళకు లొంగబోము,” అని కూడా చెప్పుకోవాలి.

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణని వ్యతిరేకిస్తూ వైసీపీ శ్రేణులు ధర్నాలు చేసినప్పుడు, ఆంక్షలు ఉల్లంఘించి పేట్రేగిపోయిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. మచిలీపట్నంలో జరిగిన ధర్నాలో మేకల వెంకట సుధాకర్ (ఏ8)కి పోలీసులు నోటీస్ ఇచ్చి విచారణ కొరకు పోలీస్ స్టేషన్‌ పిలిపించారు.

ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి పేర్ని నాని వెంటనే అనుచరులను వెంటబెట్టుకొని పోలీస్ స్టేషన్‌లోకి దూసుకు వెళ్ళి ఎస్సైపై విరుచుకుపడ్డారు.

కృష్ణాజిల్లా ఎస్పీ ఆర్‌.గంగాధర్ రావు వెంటనే స్పందిస్తూ పేర్ని నాని తీరుని ఖండించారు. చట్టాలను ఉల్లంఘించినందుకే సుధాకర్‌కి నోటీస్ ఇచ్చామని చెప్పారు.

పేర్ని నాని పోలీస్ స్టేషన్‌లో దౌర్జన్యంగా వ్యవహరించడం, డ్యూటీలో ఉన్న ఎస్సై, స్టేషన్ హౌస్ ఆఫీసర్లను బెదిరిస్తూ మాట్లాడటాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని, ఆయనపై కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోమని హెచ్చరించారు.

పోలీసులు ఎలాగూ అధికార పార్టీ నేతలకు అణిగిమణిగి పని చేయక తప్పదు. ప్రతిపక్ష నేతలు కూడా ఈవిదంగా పోలీస్ స్టేషన్‌లో దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నా, వారి పట్ల విధేయంగా వ్యవహరిస్తూనే ఉండాలి. అటువంటి వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించడమే తప్ప చర్యలు తీసుకోలేని నిసహాయత వారిని శక్తిహీనులుగా మార్చేస్తోంది.

ఈవిదంగా అధికార, ప్రతిపక్షాల ఒత్తిళ్ళ మద్య నలిగిపోతుంటే పోలీసులు శాంతి భద్రతలు ఏవిదంగా కాపాడగలరు?అని ఎవరూ ఆలోచించరు. కానీ ఒకవేళ శాంతిభద్రతలకు భంగం కలిగితే, ప్రభుత్వం, ప్రతిపక్షాలు వారినే నిందిస్తాయి. ప్రభుత్వం పోలీసులపైనే చర్యలు తీసుకుంటుంది.

సమాజంలో నేరస్తులను, చట్టాలను ఉల్లంఘించిన వారిని పట్టుకునే పోలీసులు అధికార, ప్రతిపక్ష నేతలని చూసి భయపడాల్సి రావడం చాలా విచారకరం. వాటి మద్య జరిగే రాజకీయ చదరంగంలో పోలీసులే పావులుగా మారుతుంటారనే జగమెరిగిన సత్యాన్ని పేర్ని నాని మరోసారి గుర్తు చేశారు అంతే!

ADVERTISEMENT
Latest Stories