“బాహుబలి – ది బిగినింగ్” సినిమాలో దర్శకుడు రాజమౌళి తర్వాత అంతటి పేరు ఎవరికి వచ్చింది అంటే… మరో మాటకు ఆస్కారం లేకుండా… విమర్శకుల ప్రశంసలు కొల్లగొట్టిన ‘భళ్ళాలదేవుడు’ దగ్గుపాటి రానాకే అని చెప్పాలి. అమోఘమైన శారీరక ధారుడ్యంతో ‘బాహుబలి’ సోదరుడిగా అద్వితీయమైన విలనిజంను చూపించిన రానా జన్మదినం సందర్భంగా తాజాగా “బాహుబలి – ది కన్ క్లూజన్’కు సంబంధించి ఓ పోస్టర్ విడుదలైంది.
బ్యాక్ గ్రౌండ్ లో యుద్ధ సన్నివేశం… ఫోర్ గ్రౌండ్ లో ఇనుప గద పట్టుకున్న రానా గెటప్ అదిరిపోయే రేంజ్ లో ఉంది. అలాగే రానా ధరించిన సింహం ఆకారాన్ని పోలిన కాస్ట్యూమ్స్ “బాహుబలి 2”లో రానా ఏ రేంజ్ లో రెచ్చిపోనున్నాడో చెప్పకనే చెప్పాడు. ఒక విధంగా చెప్పాలంటే… యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు కానుకగా విడుదలైన ఫస్ట్ లుక్ ను మించి, ఈ ‘భళ్ళాలదేవుడు’ ప్రేక్షకులను తన వైపుకు తిప్పుకుంటున్నాడని చెప్పవచ్చు.
చూడబోతుంటే… ‘బాహుబలి’లో మాదిరే ‘బాహుబలి 2’లో కూడా రానా పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించినట్లుగా కనపడుతోంది. ఈ పార్ట్ లో ప్రభాస్ – రానాల మధ్య జరిగే యుద్ద సన్నివేశం సినిమాకే హైలైట్ అన్న విషయాన్ని దర్శకుడు రాజమౌళితో సహా ఇతర చిత్ర బృందం ఇప్పటికే ఖరారు చేసింది. బహుశా ఆ యుద్ధ సన్నివేశంలోని ఓ భాగమే ఈ పోస్టర్ కాబోలు..!



