పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గం నుంచి వైసీపి అభ్యర్ధిగా పోటీ చేస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి మే 13వ తేదీన పోలింగ్ జరుగుతున్నప్పుడు, రెంట చింతల మండలంలోని పాల్వాయిగేటు వద్ద ఏర్పాటు చేసిన 202వ పోలింగ్ కేంద్రంలోని జొరబడి ఈవీఎంని నేలకేసి కొట్టి ధ్వంసం చేశారు.
పోలింగ్ కేంద్రంలో అందరి ఎదుటే ఆయన ఈవీఎంని పగులగొట్టారు. కానీ రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈవో ముఖేష్ కుమార్ మీనా దానిని తీవ్రమైన నేరంగా పరిగణించలేదు! ఈవీఎం స్వల్పంగా దెబ్బ తిందని మళ్ళీ పోలింగ్ సజావుగా సాగిందని చెప్పారు.
ఈ సంఘటనను కప్పి పుచ్చేందుకు ఎన్నికల సంఘం ప్రయత్నించినప్పటికీ ఆ పోలింగ్ కేంద్రంలో సీసీ కెమెరాలతో వెబ్ క్యాస్టింగ్ చేసినందున ఇది కేంద్ర ఎన్నికల కమీషన్ దృష్టికి వచ్చింది. .
పిన్నెల్లి సోదరులతో అందరిపై తక్షణం కటిన చర్యలు తీసుకోవాలని ముఖేష్ కుమార్ మీనాని ఆదేశించింది. పిన్నెల్లి రామకృష్ణ క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఈసీ రాష్ట్ర డిజిపి హరీష్ కుమార్ గుప్తాని ఆదేశించింది.
పోలింగ్‌కు ముందు, తర్వాత పిన్నెల్లి సోదరులు పల్నాడులో విధ్వంసం సృష్టించారు. ఆ ఘటనలపై ఈసీ ఆదేశంతో సిట్ బృందం విచారణ జరిపింది. కానీ ఈ విధ్వంసానికి పాల్పడిన పిన్నెల్లి సోదరులను కాక ఎస్పీ తదితర పోలీస్ అధికారులు విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించారంటూ సిట్ నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది.
అంతకు ముందు పిన్నెల్లి సోదరులను పోలీసులు గృహనిర్బందంలో ఉంచినప్పటికీ, వారి కళ్ళ ముందే ఇద్దరూ తమ వాహనాలలో హైదరాబాద్ పారిపోయారు.
వీటన్నిటినీ కలిపి చూస్తే పోలీస్ అధికారులు, రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా వైసీపి నేతల కనుసన్నలలో పనిచేస్తున్నట్లు స్పష్టమవుతోంది.
కానీ వారు చంద్రబాబు నాయుడు, పురందేశ్వరి చెప్పిన్నట్లు ఆడుతున్నారని వైసీపి నేతలు ఆరోపిస్తున్నారు. వారి సొంత మీడియాలో కూడా ఇందుకు తగ్గట్లుగానే కట్టుకధలు వండి వార్చేస్తున్నారు. కానీ పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి పోలింగ్ కేంద్రంలో జొరబడి ఈవీఎంని ధ్వంసం చేసిన వీడియో ఇప్పుడు కేంద్ర ఎన్నికల కమీషన్ చేతిలో పడటంతో వైసీపి ఇప్పుడు సమర్ధించుకోలేకపోతోంది.
వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డిని జగన్ వెనకేసుకు వచ్చిన్నట్లే మాచర్లలో అల్లర్లు, ఈవీఎం ధ్వంసం కేసులో కూడా పిన్నెల్లిని వైసీపి నేతలు వెనకేసుకువచ్చారు. ఈ విధ్వంసానికి కూడా చంద్రబాబు నాయుడు, దగ్గుబాటి పురందేశ్వరి కారణమన్నట్లు మాట్లాడుతూ చివరికి కేంద్ర ఎన్నికల కమీషన్ మీద కూడా ఎదురు దాడి చేస్తున్నట్లు మాట్లాడటానికి వెనకాడటం లేదు.
అయితే మాచర్లలో పిన్నెల్లితో సహా ఏపీలో వైసీపికి ఈసారి ఎలాగూ ఓటమి తప్పదు. అప్పుడు ఈ కేసులన్నీ వారి మెడలకే చుట్టుకోనున్నాయి. టిడిపి కూటమి అధికారంలోకి వస్తే ఈ నేరాల నుంచి వైసీపిలో ఎవరూ తప్పించుకునే అవకాశమే ఉండకపోవచ్చు.






