పోలవరం, కాళేశ్వరం… పాపం ఎవరిది?

Polavaram, Kaleshwaram... Whose Sin Is It?

అన్నీ తెలిసి కేసీఆర్‌, ఏమీ తెలియక జగన్‌ రెండు అతిపెద్ద సాగునీటి ప్రాజెక్టులకు తీరని నష్టం కలిగించారు. కేసీఆర్‌, బిఆర్ఎస్ నేతలు ఎంతో గొప్పలు చెప్పుకున్న కాళేశ్వరం ప్రాజెక్టులో మొట్టమొదటిదైన మేడిగడ్డ బ్యారేజిలో మూడు పిల్లర్లు ఆయన అధికారంలో ఉండగానే క్రుంగిపోయాయి. వాటి మరమత్తులకి వందల కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు చెపుతున్నారు.

మూడు పిల్లర్లు క్రుంగిపోవడం వలన ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తున్నా అంత పెద్ద బ్యారేజీలో చుక్క నీళ్ళు నిలువచేయలేని దుస్థితి ఏర్పడింది. నిలువచేస్తే మిగిలిన పిల్లర్లు కూడా దెబ్బ తినే అవకాశం ఉందనే నిపుణుల హెచ్చరికలతో వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువకు విడుదల చేస్తున్నారు. దీని వలన వర్షాకాలం ముగిసిన తర్వాత మేడిగడ్డ నుంచి కాళేశ్వరం ప్రాజెక్టులో మిగిలిన బ్యారేజీలకు చుక్క నీరు అందించలేని దుస్థితి నెలకొంది.

ADVERTISEMENT

ఇదిగాక అన్నారం, సుందిళ్ళ బ్యారేజీల గోడలకు పగుళ్ళు ఏర్పడటంతో వాటిలో కూడా నీళ్ళు లీక్ అయిపోతున్నాయి. కేసీఆర్ అధికారంలో ఉండగానే వందల కోట్లు ఖర్చు చేసిన భారీ మోటర్లు ఏర్పాటు చేసిన కన్నెపల్లి పంప్ హౌస్ నీళ్ళలో మునిగి పోయింది.

సుమారు లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నిరుపయోగంగా మారడానికి కారణం మీరంటే మీరని కాంగ్రెస్‌, బిఆర్ఎస్ నేతలు వాదించుకుంటున్నారు. వారి వాదనలు ఎలా ఉన్నా లక్ష కోట్లు ప్రజాధనం ఖర్చు చేసినా ఫలితం దక్కలేదని అర్దమవుతోంది.

ఇక ఏపీలో పోలవరం ప్రాజెక్టుకి జాతీయ ప్రాజెక్టు ప్రత్యేక హోదా ఉంది. కనుక కేంద్ర ప్రభుత్వం నిధులు అందించి పర్యవేక్షిస్తుంటుంది. కానీ జగన్‌ అధికారంలోకి రాగానే రివర్స్ టెండరింగ్ పేరిట శరవేగంగా సాగుతున్న దాని పనులకు బ్రేకులు వేస్తే కేంద్రం మొక్కుబడిగా మందలించి ఊరుకుంది తప్ప ప్రాజెక్టుని కాపాడలేదు!

తత్ఫలితంగా 5 ఏళ్ళలో జగన్‌ దానిని కూడా భ్రష్టు పట్టించేశారు. దాంతో పోలవరం ప్రాజెక్టు కధ మళ్ళీ మొదటికొచ్చింది. జగన్‌ చేసిన తప్పులను సిఎం చంద్రబాబు నాయుడు మళ్ళీ ఒకటొకటిగా సరిచేయాల్సివస్తోంది.

పోలవరం ప్రాజెక్టులో దెబ్బ తిన్న ‘డయాఫ్రం వాల్’ స్థానంలో కొత్తది నిర్మించాలని కేంద్ర, రాష్ట్ర జలవనరుల నిపుణుల సూచనల మేరకు రూ.3,090 కోట్లు మళ్ళీ ఖర్చు చేయక తప్పడం లేదు. ఈ అధనపు భారం రాష్ట్ర ప్రభుత్వమే భరించవలసి ఉంటుంది.

‘అన్నీ నాకే తెలుసు… నేను మహా మేధావిననే’ గర్వం, అహంభావంతో కేసీఆర్‌ కాళేశ్వరం ప్రాజెక్టుని ఇష్టం వచ్చిన్నట్లు నిర్మిస్తే, చంద్రబాబు నాయుడుపై ద్వేషంతో ఆయన మొదలుపెట్టిన ప్రతీ పనిని నిలిపివేయాలనే దురాలోచనతో జగన్‌ పోలవరం ప్రాజెక్టుకి నష్టం కలిగించడానికి వెనకాడలేదు.

ఈ రెండు మెగా ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్‌, జగన్‌ ఏ ఉద్దేశ్యంతో ఈవిదంగా వ్యవహరించినప్పటికీ వారి వలన రెండు తెలుగు రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోయాయి. కానీ అందుకు వారిరువురూ ఏమాత్రం పశ్చాతాపం పడకపోగా అధికార పార్టీలపై ఎదురుదాడి చేస్తుండటాన్ని ఏమనుకోవాలి?

ADVERTISEMENT
Latest Stories